గరగపర్రు ప్రశాంతం..బంధనాలు వీడి బయటకు..

2 Jul, 2017 11:15 IST|Sakshi
గరగపర్రు ప్రశాంతం

పోలీసుల బూటు చప్పుళ్లు.. నిషేధాజ్ఞలు..
ఆంక్షలు.. ఉద్యమాలు.. ఆందోళనలతో

అట్టుడికిన గరగపర్రులో శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. విభేదాలు, విద్వేషాలతో రగిలిన ప్రజలు జగనన్న మాటతో సామరస్య పథంవైపు ముందుకు సాగుతున్నారు. దళితుల సాంఘిక బహిష్కరణతో రావణకాష్టంలా మండిన గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో కొంత మార్పు వచ్చింది. కలిసుందాం రండి.. విద్వేషాలు వీడండి.. అంటూ ఆయన ఇచ్చిన పిలుపుతో ఇరువర్గాలు శాంతించాయి. శనివారం గ్రామంలో పోలీసు బందోబస్తును తగ్గించారు. గ్రామం నలువైపులా చెక్‌ పోస్టులను ఎత్తివేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వాహనాలు యథావిధిగా గ్రామం మీదుగా రాకపోకలు సాగించాయి.
వైఎస్‌ జగన్‌ పర్యటనతో స్పష్టమైన మార్పు
నెలకొన్న సాధారణ జీవనం
తగ్గిన పోలీసు బందోబస్తు
సడలిన ఆంక్షలు.. చెక్‌పోస్టులు ఎత్తివేత
ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ
కొనసాగుతున్న దళితేతరుల దీక్షలు
ప్రభుత్వం శాంతి కమిటీ ఏర్పాటు
♦  త్వరలో గ్రామానికి వైఎస్సార్‌ సీపీ కమిటీ


భీమవరం :
పాలకోడేరు మండలం గరగపర్రు ప్రశాం తంగా మారింది. నిన్నటివరకూ ఉద్యమాలతో రగిలిన గరగపర్రులో ఇప్పుడిప్పుడే శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. దళితులను నాయకులు పరామర్శిస్తుండగా.. దళితేతరులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. అయితే ఉద్రిక్తతలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. దళితుల సాంఘిక బహిష్కరణతో రావణకాష్టంగా మారిన గరగపర్రులో వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పర్యటనతో కొంత మా ర్పు వచ్చింది.


ఇరువర్గాలతో మాట్లాడి విభేదాలను పక్కన పెట్టి అన్ని వర్గాల ప్రజలు గతంలో మా దిరిగా సోదరభావంతో శాంతియుత జీవనం సాగించాలని వైఎస్‌ జగన్‌ ఇరువర్గాలకు నచ్చచెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కూడా మరో అడుగు ముందుకు వేసి శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో కొంత శాంతియత వాతావరణం ఏ ర్పడింది. నిన్నటివరకూ పోలీసు ముట్టడిలో ఉద్రిక్తతగా కనిపించిన గరగపర్రు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.

భీమవరం, తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోల నుంచి బస్సులతోపాటు ఆటోలను కూడా ఆ రహదారిలో నిలిపివేయడంతో కొమరాడ అన్నవరం, గొల్లలకోడేరు, గరగపర్రు, యండగండి, కేశవరం, అప్పనపేట తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శనివారం ఉదయం గ్రామం మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించడంతో పాటు గరగపర్రు నలుదిక్కులా ఏర్పాటుచేసిన పోలీస్‌ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. పోలీసు దిగ్బంధనంలో నుంచి గ్రామం బయటకు వచ్చింది. గ్రామంలో మాత్రమే గొడవలు జరగకుండా కొద్దిపాటి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

చెక్‌ పోస్టుల ఎత్తివేత.. తగ్గిన పోలీసు బలగాలు
గరగపర్రు గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ కారణంగా వివాదం ఏర్పడటంతో గ్రామంలో దాదాపు 500 మందికి పైగా పోలీసులు మోహరించిన సంగతి తెలిసిందే. జగన్‌మోహన్‌రెడ్డి గ్రామంలో పర్యటించి ఇరువర్గాలతో మాట్లాడి విభేదాలు పక్కన పెట్టాలని హితవు చెప్పడంతో రెండు వర్గాలు అంగీకరించాయి.  గ్రామంలో శనివారం పోలీసు బలగాలను గణనీయంగా తగ్గించారు.  పాలకోడేరు మండలం గొల్లలకోడేరు వంతెన వద్ద, గణపవరం మండలం పిప్పర వద్ద, యండగండి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు చెక్‌ పోస్టులను తొలగించారు. దీంతో వాహనచోదకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగించారు.

ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ
గరగపర్రు రూట్‌లో శనివారం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు య«థావిధిగా తిరి గాయి. ఉదయం నుంచే భీమవరం ఆర్టీసీ డిపో నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించామని డిపో మేనేజర్‌ గిరిధర్‌కుమార్‌ చెప్పారు.  మాజీ పార్లమెంట్‌ సభ్యులు వి.హనుమంతరావు శని వారం గరగపర్రు గ్రామాన్ని సందర్శించారు.

శాంతి కమిటీకి సహకరిస్తాం: ఆళ్ల నాని
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో శాంతి నెలకొని, అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో మాదిరిగా అన్నివర్గాల ప్రజలు కలిసి ఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. రెండు వర్గాల మధ్య విభేదాల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ ప్రయత్నాలకు తాము అన్ని విధాలా తోడ్పాటును అందిస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన కమిటీ త్వరలో ఈ గ్రామంలో పర్యటించి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుందని ఆళ్ల నాని ప్రకటించారు.

మరిన్ని వార్తలు