ఎన్నాళ్లీ పడిగాపులు?!

15 Nov, 2016 22:59 IST|Sakshi
ఎన్నాళ్లీ పడిగాపులు?!

– అరకొరగా నగదు మార్పిడి, ఏటీఎంల పరిస్థితి మరీ దారుణం
– సహకార బ్యాంకుల్లో అప్పుల జమ ఆపేసిన ఆర్‌బీఐ
– పీవోఎస్‌ మిషన్ల ద్వారా ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మినీ ఏటీఎంలు

అనంతపురం అగ్రికల్చర్‌ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు కొత్త నోట్ల తిప్పలు కొనసాగుతున్నాయి. ఆరో రోజు మంగళవారం కూడా జిల్లా అంతటా బ్యాంకులన్నీ ప్రజలతో పోటెత్తాయి. దాచుకున్న పాత రూ.500, రూ.1,000 ఇవ్వడం ద్వారా రూ.4,500 వరకు నగదు మార్పిడి జరుగుతోంది. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకులో నగదు మార్పిడి బాగానే ఉన్నా... మిగిలిన బ్యాంకుల్లో తమ ఖాతాదారులకే అదీ కూడా నగదు నిల్వలను బట్టి రూ.2వేల నుంచి రూ.4 వేల వరకు ఇస్తున్నారు. దాని కోసం సామాన్య వర్గాలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.

సాయంత్రం వరకూ నిరీక్షణ
నోట్ల మార్పిడి కోసం ఉదయం 9 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నా... సాయంత్రానికి కాని కొంత డబ్బు లభించే పరిస్థితి లేదు. అన్ని బ్యాంకుల్లో రూ.500, రూ.1000 పాత నోట్ల డిపాజిట్లు కొనసాగుతున్నాయి. అయితే తొలి నాలుగు రోజుల పాటు ఉన్న రద్దీ ఐదో రోజు కనిపించలేదు.  రూ.2.50 లక్షలకు మించి డిపాజిట్లకు ఆదాయపుశాఖ పన్ను పోటు ఉంటుందనే ఆందోళనతో కొత్త ఖాతాదారులు పాన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రధానంగా సాయినగర్‌ ఎస్‌బీఐ ప్రధాన శాఖ వద్ద జన జాతర కొనసాగుతుండగా గంటల కొద్దీ బారుల్లో ఉండలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అన్ని బ్యాంకుల వద్ద పోలీసు పహారా మధ్య నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి.

ఇబ్బందుల్లో ‘సహకార’ ఖాతాదారులు
మంగళవారం నుంచి అన్ని రకాల సహకార బ్యాంకుల్లో రూ.500, రూ.1000 పాత నోట్ల డిపాజిట్లను రిజర్వ్‌బ్యాంకు రద్దు చేసినట్లు సమాచారం. దీంతో అప్పులకు జమ చేయడానికి వీలులేకుండా పోవడంతో ఖాతాదారులకు సరికొత్త ఇబ్బంది ఎదురైంది.  రూ.100 అంతకన్నా తక్కువ విలువ చేసే నోట్లను మాత్రమే సహకార బ్యాంకుల్లో జమ చేసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు.

దిష్టిబొమ్మల్లా ఏటీఎంలు
జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించి 520 వరకు ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఇవాళ... రేపు అంటూనే వారం రోజులుగా ఇవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటీఎంలు పూర్తీ స్థాయిలో అందుబాటులోకి వస్తే జనం కష్టాలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. కనీసం రూ.100 నోట్లను రోజుకు రెండు మూడు సార్లు ఏటీఎంలలో నింపితే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

చిరిగిన నోట్లే గతి
వంద నోట్ల కొరత భారీగా ఉండటంతో రోజురోజుకూ ఇబ్బందులు ఎక్కువవుతున్నట్లు బ్యాంకర్లే చెబుతున్నారు. చాలా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చిరిగిపోయినవి, పనికిరావని లైన్లు గీసినవి, రిజర్వ్‌బ్యాంకుకు వెనక్కు పంపేందుకు ఉంచిన కాలం చెల్లిన రూ.100 నోట్లను ప్రజలకు అంటగడుతున్నారు. రూ.2 వేల నోటుకు చిల్లర దొరకడం తీవ్ర సమస్యగా పరిణమించిన నేపథ్యంలో ఏదో ఒకటిలే అంటూ ప్రజలు వాటినే తీసుకెళుతున్నారు.

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మినీ ఏటీఎంలు
ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ కొంత వెసులుబాటు కల్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా ఎస్‌బీఐలో కరెంటు అకౌంట్‌ కలిగివున్న కొందరు ఖాతాదారులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మిషన్లు ఇవ్వడంతో పాటు వారి ఖాతాల్లోకి రూ.50 నుంచి రూ.ఒక లక్ష వేశారు.  మంగళవారం అనంతపురంలోని  శ్రీకంఠం సర్కిల్‌లోని కార్తికేయ మెడికల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పీవోఎస్‌ని ఎస్‌బీఐ ఆర్‌ఎం ఎంవీఆర్‌ మురళీకృష్ణ ప్రారంభించారు. ఏ బ్యాంకు ఖాతాదారులైనా అవసరాన్ని బట్టి రూ.1 వేయి నుంచి రూ.2 వేలు డ్రా చేసుకుసే సౌలభ్యం కల్పించారు. ఖాతాదారుడు తన క్రెడిట్‌కార్డులను స్కైప్‌ చేసి నగదు తీసుకోవచ్చు.

మరిన్ని వార్తలు