మహిళల ఉపాధికి ప్రణాళిక

13 Oct, 2016 21:49 IST|Sakshi
మహిళల ఉపాధికి ప్రణాళిక

కడప కార్పొరేషన్‌:
టైలరింగ్‌ వృత్తినే నమ్ముకొని పనిచేస్తున్న మహిళలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ తెలిపారు. గురువారం పాతరిమ్స్‌లో ఉత్తర నగర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నాలుగవ సంవత్సరం యూనిఫారం దుస్తులు కుట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బట్ట కటింగ్, గుండీలు, ఖాజాలు వేసే విధానాన్ని పరిశీలించారు.  అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో గార్మెంట్స్‌ యూనిట్లు లేనందున టైలరింగ్‌ చేసే మహిళలకు ఏడాదంతా పని ఉండటం లేదన్నారు. మహిళలకు శిక్షణ ఇవ్వడం ద్వారా త్వరలో ప్రొద్దుటూరు, మైలవరంలలో రానున్న గార్మెంట్‌ యూనిట్లకు  వీరిని టై అప్‌ చేస్తామన్నారు. బెంగళూరులో ఇలాంటి  టైలరింగ్‌ కేంద్రాలకు విపరీతమైన డిమాండ్‌ ఉందని చెప్పారు.
సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కృషి..
కుట్టు శిక్షణ  కేంద్రంలో బాత్‌రూములు, తాగునీరు లేదని, వర్షం వస్తే బిల్డింగ్‌ ఉరుస్తోందని మహిళలు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఒక జత కుట్టినందుకు ఇచ్చే రూ.40లు ఏ మాత్రం సరిపోలేదని, దాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ ఇక్కడ చాలా లోపాలున్నాయని  తనకు నచ్చలేదని చెప్పారు. ఇక్కడి వసతులు మెరుగుపరచడంగానీ, వేరే బిల్డింగ్‌కు మార్చడంగానీ చేస్తామని భరోసా ఇచ్చారు.  మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటసుబ్బయ్య, నగరపాలక సంస్థ కమీషనర్‌ పి. చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, టీఎంసీ గంగులయ్య, సీఓలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు