పనికిరాని భూముల్లో ప్లాంటేషన్‌

5 Aug, 2016 23:36 IST|Sakshi
పనికిరాని భూముల్లో ప్లాంటేషన్‌
  •  జిల్లాలో 9 వేల ఎకరాల్లో 36 లక్షల మొక్కలు..
  • ఈ నెల 9 నుంచి ప్రారంభం.. 15 వరకు పూర్తి
  • భూముల స్థితిపై నేడే అధ్యయనం చేయండి
  •  ఎంపీడీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా
  • సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రాళ్లు, రప్పలున్న ప్రభుత్వ భూములలో కమ్యూనిటీ భాగస్వామ్యంతో బ్లాక్‌ ప్లాంటేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితారాణా తెలిపారు. ‘ తెలంగాణకు హరితహారం’ కింద ప్రతి మండలంలో లక్ష మొక్కలను నాటేందుకు అనువైన, వివాదరహిత, సాగుయోగ్యం కాని, నిరుపయోగ ప్రభుత్వ భూములను గుర్తించాలని తహశీల్దారులకు సూచించారు. కనీసం పది ఎకరాల భూమిలో బ్లాక్‌ప్లాంటేషన్‌ చేపట్టేందుకు సమగ్ర నివేదికలను అందజేసేందుకు ఈ నెల 6 న ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఈజీఎస్‌ టీఏలు, ఫారెస్టు అధికారులతో పర్యటించి, ఆయా భూముల స్థితిపై అధ్యయనం చేసి, కార్యాచరణకు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో తహసీల్దార్లు, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మండలానికి 250 ఎకరాల్లో కమ్యూనిటీ బ్లాక్‌ ప్లాంటేషన్లు కింద 36 మండలాల్లో 9 వేల ఎకరాల్లో 36 లక్షల మొక్కలను నాటి, వాటి ఎదుగుదలకు అవసరమైన ఎరువులు (వర్మి) నీటివసతి, రక్షణ కంచె, కందకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లభ్యమైతే (250) ఎకరాలను ఒకే బ్లాకుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వాటిని మోడల్‌ ప్లాంటేషన్‌ బ్లాకులుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల్లో మార్పు కనబడాలన్నారు. ఈనెల 9 నుంచి మొక్కలు నాటే పనులను చేపట్టి, 15లోపు పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుగుణంగా కూలీలను సమీకరించే బాధ్యతను ఎంపీడీవోలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్లాకులో ఐదు శాతం భూమిలో బతుకమ్మ పండుగకు, నిత్య పూజలకు ఉపయోగపడే పూల మొక్కలు, జమ్మి చెట్లు, కుంకుడు, ఉసిరి చెట్లు, రావి చెట్లను  నాటించనున్నట్లు తెలిపారు. కోతులకు ఆహారంగా ఉపయోగపడే పండ్ల చెట్లను కూడా పెంచనున్నట్లు యోగితారాణా తెలిపారు. ఈ బ్లాకులు జీవ వైవిధ్య అడవులుగా రూపొందుతాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. హరితహారం ఫలితాలు మూడు సంవత్సరాల్లో ప్రతిబింబిస్తాయని అటవీశాఖ అడిషనల్‌ సీసీఎఫ్‌ ఎస్‌.కె.గుప్త ఈ  సందర్భంగా అన్నారు. కమ్యూనిటీ బ్లాక్‌ ప్లాంటేషన్‌లకు హెచ్‌ఎండీఏ, మెదక్‌ జిల్లాల నుంచి మొక్కలు తెప్పిస్తున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితిని తట్టుకునే మొక్కలను మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. గుంతలు తీసి, నాటే ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలన్నారు. బ్లాక్‌ ప్లాంటేషన్ల వలన పచ్చదనం పెరగడంతో పాటు, అడవుల సంరక్షణలో సామాజిక బాధ్యత పెరుగుతుందన్నారు. మొక్కలు  నిలబడి ఎదిగేందుకు ఊతంగానాటే కర్రలను వదలుగా కట్టాలని చెప్పారు. రాళ్లు, రప్పలు ఉన్న భూములలో మొక్కలు ఎదిగేందుకు, వేళ్లూనుకునేందుకు గుంతలను లోతుగా తీయాలని, కొంత మట్టిని గుంతలో వేసిన తదుపరి కర్రతో పాటు మొక్కను నాటాలని డీఎఫ్‌ఓ ప్రసాద్‌ వివరించారు. మొక్క మొక్కకు మధ్య మూడు  మీటర్లు దూరం ఉండాలన్నారు. బ్లాక్‌ ప్లాంటేషన్లకు వేగంగా పెరిగే, ఆ నేల స్వభావానికి తగిన మొక్కలను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి, డీఎఫ్‌వో సుజాత, డీఆర్‌వో పద్మాకర్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, ఆర్‌డీవోలు యాదిరెడ్డి, సుధాకర్‌ రెడ్డి, నగేశ్‌లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 
     
మరిన్ని వార్తలు