న్యాయం చేయండి

19 Sep, 2017 00:11 IST|Sakshi
న్యాయం చేయండి
ముఖ్యమంత్రికి పోలవరం నిర్వాసితుల వేడుకోలు
పోలవరం:పోలవరం ముంపు మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు నిర్వాసితులు సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి తరలి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. తరతరాల నుంచి వేలేరుపాడు మండలం కట్టమూరు పంచాయతీ చిగురుమామిడి గ్రామంలో నివసిస్తున్నామని, కూలి పని చేసుకుని జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. తమ కుటుంబాలను ముందుగా ఆర్‌అడ్‌ఆర్‌ జాబితాలో చేర్చారని ,గ్రామ సభ నిర్వహించకుండా, ఏ విధమైన విచారణ లేకుండా పేర్లు తొలగించారని తెలిపారు. తమకు రేషన్‌కార్డు, ఇళ్లు ఉన్నాయని, అయిన్పటికీ తమతో సంతకాలు చేయించుకుని స్థానికేతరుల సాకుతో పేర్లు తొలగించారని మాదా సుధాకర్, సయ్యద్‌ ఖాశిం, వాదం చిట్టిబాబు తదితరులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామంలో ఉంటే ప్యాకేజీ వర్తింపచేయాలని, గ్రామాల్లో లేకుంటే ప్యాకేజీ వర్తించదని, పరిశీలించవలసిందిగా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ కె.భాస్కర్‌ను ఆదేశించారు.అలాగే కుక్కునూరు మండలంలోని అమరవరం పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌ తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. తమ గ్రామానికి చుట్టూ ఉన్న భూములు సేకరించారని, తాము కూడా భూములు కోల్పోయామని, కానీ తమ గ్రామాలను మాత్రం ముంపు గ్రామాలుగా ప్రకటించలేదని పేర్కొన్నారు. భూములన్నీ కోల్పోయిన తరువాత ఆ ప్రాంతంలో ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
 
 
మరిన్ని వార్తలు