ఆశయాన్ని బతికిస్తా

6 Jul, 2017 08:30 IST|Sakshi
ఆశయాన్ని బతికిస్తా

ఇప్పుడు మా కుటుంబంలో నేనొక్కతినే..
మా వాళ్లంతా దేవుని దగ్గరికి వెళ్లారు.
మేము ముగ్గురం ఆడ పిల్లలమే..
మగ పిల్లల్లానే పెంచింది మమ్మల్ని.
ఉన్నత స్థానంలో చూడాలని తపించింది.
కష్టానికి తగ్గట్లే బాగా చదువుతున్నాం.
విధి కన్నుకుట్టింది.
అమ్మ.. నాన్న.. ఇద్దరు చెల్లెలను దూరం చేసింది.
ఇప్పటికీ అంతా కలగానే ఉంది.
ఈ లోకం వీడాలనుకున్నా.
అమ్మ గుర్తొచ్చింది.
ఆమె కల ఆత్మస్థైర్యం నింపింది.
ఇప్పుడు నా ముందున్నది ఆ లక్ష్యం ఒక్కటే.
నాన్న కూడా మా ఉన్నతికి ఎంతో తపించారు.
వాళ్ల ఆశయాన్ని బతికిస్తా.
- ఉబికివచ్చే కన్నీళ్లతో తాడిపత్రి ప్రసన్న చెప్పిన మాటలివి.


తాడిపత్రి టౌన్‌ : పట్టణంలోని కృష్ణాపురం 3వ రోడ్డులో ఉంటున్న సులోచనమ్మ, ఇద్దరు కూతుళ్లు ప్రత్యూష, సాయి ప్రతిభ మంగళవారం దారుణ హత్యకు గురి కాగా.. సులోచనమ్మ భర్త రామసుబ్బారెడ్డి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కుటుంబంలో పెద్ద కుమార్తె ప్రసన్న మాత్రమే ఇప్పుడు ఒంటరిగా మిగిలింది. ఈమె తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతోంది. కుటుంబ సభ్యులంతా మరణించడంతో ప్రసన్న బిక్కుబిక్కుమంటోంది. బుధవారం విలేకరులు ఆమెను కదిలించే ప్రయత్నం చేయగా కన్నీటి పర్యంతమయింది. ఆ రోజు ఏమి జరిగిందో ఇలా చెప్పింది.

‘‘మంగళవారం ఉదయం 7.30 గంటలకు యూనివర్సిటీకి బంధువులు ఫోన్‌ చేశారు. అమ్మకు ఆరోగ్యం బాగోలేదన్నారు. ఏమయిందోనని ఆందోళన పడ్డా. 10.30 గంటల సమయంలో తాడిపత్రి పోలీసుల నుండి అమ్మా,చెల్లెళ్లు హత్యకు గురైనట్లు ఫోన్‌ వచ్చింది. బోరున ఏడ్చేశా. తిరుపతి పోలీసుల సహకారంతో సాయంత్రానికి తాడిపత్రి చేరుకున్నా. విగతజీవులుగా పడి ఉన్న అమ్మా చల్లెళ్లను చూసి తట్టుకోలేకపోయాను. నాన్నే కారణమని బంధువులు చెప్పడంతో విపరీతమైన కోపం వచ్చింది. బుధవారం నాన్న నుంచి రెండు సార్లు ఫోన్‌ వచ్చింది. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. పుట్లూరు రోడ్లులోని కంపచెట్ల మధ్య పడి ఉన్నానన్నారు. అంతే ఫోన్‌ కట్‌ అయింది. మళ్లీ నేను ఫోన్‌ చేస్తే మాట్లాడలేదు. పోలీసులకు చెప్పా. ఆ తర్వాత అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో నాన్న చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎంతయినా నాన్న కదా. చూడాలనిపిస్తోంది. తప్పకుండా వెళ్తా. మా ఉన్నతికి అమ్మానాన్న ఎంతో తపించారు. వాళ్ల ఆశయాన్ని బతికిస్తా.

మరిన్ని వార్తలు