కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

1 May, 2017 22:57 IST|Sakshi
కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి

ఆర్థికశాఖ మంత్రి ‘ఈటల’
నిర్మల్‌టౌన్‌: రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదివారం జిల్లా అధికారులతో సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్‌ ద్వారా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల వద్ద ‡గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. అలాగే అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు ఉంచుకోవాలని సూచించారు.

ఎండాకాలం ఉన్నందునా, రైతులకు టెంట్‌ సౌకర్యంతో పాటు తాగునీరు, మెడికల్‌ టీంను కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వారి కూలి చెల్లింపుల్లో జాప్యం చేయరాదన్నారు. కేంద్రాల వద్ద తప్పనిసరిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు

ధాన్యం విక్రయించిన రైతులకు 48గంటల్లో వారికి డబ్బులు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా జేసీ శివలింగయ్య స్పందిస్తూ ధాన్యం విక్రయించిన రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు అందజేస్తామని తెలిపారు. ఆర్డీవో ప్రసూనాంబ, డీఎస్‌వో సుదర్శన్, మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్, డీఏవో గంగారాం, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీపీఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు