కష్టాలను జయించి.. కలను బతికించి..!

20 Sep, 2016 17:15 IST|Sakshi
కష్టాలను జయించి.. కలను బతికించి..!
  • మేకప్‌మ్యాన్‌గా రాణిస్తున్న రామాంజనేయులు
  • నిట్రవట్టి నుంచి ప్రస్థానం
  • ఫిలింనగర్‌లో ప్రావీణ్యం
  • పలు సినిమాల్లో అవకాశం
  •  
    రంగులన్నీ కలిపి..బ్రష్ పట్టుకొని..ఓ యువతికి అందంగా మేకప్ వేసే కల.. అతన్ని వెంటాడింది. వేదనకు గురిచేసింది. పుట్టు పేదరికం.. తండ్రికి కాళ్లు లేవు..కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించే అమ్మ.. పెద్ద చదువులు చదివే  ఆర్థిక స్థోమత లేదు.. అయినా అతనిలో ‘కల’ చావలేదు. చదువును అర్ధంతరంగా ఆపేసి ఆర్థికంగా కుదుటపడేందుకు చెప్పినపనల్లా చేశాడు. తన కలను నెరవేర్చుకునేందుకు కష్టాలను ఎదుర్కొన్నాడు. నేడు సినిమా హీరో,  హీరోయిన్లకు మేకప్ వేస్తూ బిజీ ఉన్నాడు. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన రామాంజనేయులు విజయగాథ ఇది..
     
     ఆలూరు:  
     ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాజ్ఞ్మయం
     ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం

    నృత్యం, నాటకం...మరేదైనా కళ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఆంగికం, వాచకంతోపాటు ఆహార్యం(మేకప్) తప్పని సరి. పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో చేర్చేది అదే.
     
    అందుకే భరతుడు తన నాట్యశాస్త్రంలో ఆహార్యాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. అయితే నటీనటులకు, కళాకారులకు వచ్చిన పేరు వారిని అందంగా తీర్చిదిద్దిన  మేకప్‌మెన్‌లకు రావడం లేదు. అయినా ఈ కళలో తమను తాము నిరూపించుకునేందకు కొందరు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వారిలో రామాంజనేయులు ఒకరు.  
     
    హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన తిమ్మప్ప, దేవమ్మ దంపతుల పెద్దకుమారుడు రామాంజనేయులు. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్నది అతని కల. గ్రామాల్లో నాటకాలు వేసే సమయంలో..ధుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, హనుమంతుడు తదితర పాత్రధారులకు మేకప్ వేసే విధానాన్ని ఆసక్తిగా గమనించే వాడు.
     
    ఎప్పటికైనా సినిమాల్లో మేకప్‌మెన్‌గా స్థిరపడాలన్నదే తన ఆశయమని గ్రామస్తులకు చెప్పేవాడు. కుటుంబం పేదరికంలో ఉండంతో హాలహర్విలో పదోతరగతి పూర్తయిన వెంటనే బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. డబ్బు కూడబెట్టేందుకు ఇంటి నిర్మాణ పనులు చేశాడు. ఖాళీ సమాయల్లో ఎవరైనా పనిచెబితే కాదనేవాడు కాదు. కొంత డబ్బు పోగయ్యాక ఫిలింనగర్ వెళ్లి అవకాశాల కోసం వేట మొదలు పెట్టాడు. అక్కడ కొందరి వద్ద మేకప్ ఎలా వేయాలో నేర్చుకున్నాడు.
     
    బుల్లితెరలో అవకాశం..
    మేకప్ మెన్ తన కల అని.. పని ఇవ్వాలని అక్కడ సినీనటులను ప్రాధేయపడేవాడు. నైపుణ్యం లేకపోవడంతో వారు అందుకు నిరాకరించేవారు. నిరుత్సాహ పడకుండా బుల్లితెరలో అవకాశాలను కోసం ప్రయత్నించాడు. ప్రయత్నం గట్టిగా ఉండడంతో అతనికి అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకొని తన నైపుణ్యమేమిటో తేల్చిచెప్పాడు. ఇంతటితో ఆగకుండా..గుజరాత్‌కు వెళ్లి మేకప్ సంస్థలో శిక్షణ పొంది తిరిగి హైదారాబాద్‌కు వచ్చారు.
     
    జనతా గ్యారేజ్‌లో..
    పనితనం ఎల్లకాలం బయటకు రాకుండా మానదు. అలాగే రామాంజనేయులు పనితనం కూడా వెలుగులోకి వచ్చింది.. గబ్బర్‌సింగ్, జనతాగ్యారేజ్ సినిమాల్లో నటీనటులకు ఇతను మేకప్ వేశారు. అలాగే తమిళ, మళియాళం సినిమాల్లోనూ నటీనటులకు మేకప్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. ‘‘బతుకుదెరువు కోసం అష్ట కష్టాలు పడ్డాను.

    ఎన్నో రాత్రులు పస్తులతో గడిపాను. బ్రష్ పట్టుకొని మేకప్ వేస్తున్నప్పుడు ఇవ్వన్నీ మరచిపోతాను.’’ అని రామాంజనేయులు తన స్వగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.  తన ‘కల’ నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని.. మేకప్ కళను ప్రోత్సహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖన విద్యను నేర్పించాలన్నారు.

మరిన్ని వార్తలు