రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి

20 Sep, 2016 08:49 IST|Sakshi

ప్రొద్దుటూరు క్రైం: రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటుచేయాలని వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల న్యాయవాదులను కలుపుకొని త్వరలో ఇక్కడ భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో సోమవారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయమై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎంవి రమణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మల్లేల లింగారెడ్డిలతో పాటు పెద్దఎత్తున న్యాయవాదులు పొల్గొన్నారు.

డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణలో ఉన్న మన న్యాయవాదుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తిరిగి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటైతే ఎల్‌ఎల్‌బీ పట్టా తీసుకొని కొత్తగా వచ్చే రెండు మూడు బ్యాచ్‌లకైనా అక్కడ పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కోస్తా వాళ్లను తట్టుకొని మన న్యాయవాదులు నిలబడాలంటే రాయలసీమలో ఏదో ఒకచోట హైకోర్టు ఉండాలన్నారు. హైకోర్టు  మన హక్కు అని తెలిపారు. శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం హైకోర్టు, రాజధానిలు ఒక ప్రాంతంలో ఒకటి ఉంటే రెండో ప్రాంతంలో ఇంకోటి ఉండాలన్నారు. ఈ రోజు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందున న్యాయంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మల్లేల లింగారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయన్నారు. కోస్తాలో రాజధాని ఏర్పాటైనందున హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడం సముచితమని పేర్కొన్నారు. అవసరరీత్యా కోర్టులు ఎక్కడున్నా వెళ్లాల్సిందేనని చెప్పారు. మనకు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ హైకోర్టును మాత్రం ముందుగా సాధించుకొని తీరాల్సిందేనని ఆయన తెలిపారు.

త్వరలో నాలుగు జిల్లాల బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో చర్చించిన తర్వాత ప్రొద్దుటూరులో భారీ సమావేశం ఏర్పాటు చేయాలని, పార్టీలకతీతంగా ఉద్యమాన్ని  ముందుకు తీసుకెళ్లాలని సభ్యులు నిర్ణయించారు. బార్‌ అసోసియేషన్‌ అ«ధ్యక్షుడు ఆర్‌వి భాస్కర్‌రావు, సీనియర్‌ న్యాయవాదులు ముడిమేల కొండారెడ్డి, ఇవి సుధాకర్‌రెడ్డి, పుత్తాలక్ష్మిరెడ్డి, గొర్రెశ్రీనివాసులు, జిలానిబాషా,సుదర్శన్‌రెడ్డి, దాదాపీర్‌ మాట్లాడారు. బార్‌అసోసియేషన్‌ కార్యదర్శి ఓబులేసు, ఏపీపీ మార్తల సుధాకర్‌రెడ్డి, మల్లేల లక్ష్మీప్రసన్న, జింకా విజయలక్ష్మి, నిర్మలాదేవి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు