తలరాతలు మార్చిన పంచాయతీ రిజర్వేషన్లు

2 Jul, 2013 03:38 IST|Sakshi

నల్లగొండ, న్యూస్‌లైన్:పంచాయతీ ఎన్నికల సైరన్ మోగింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ గెజిట్‌ను ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు సోమవారం సమర్పించడంతో బుధవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో గ్రామాల్లో ఎన్నికల హడావుడి ఆరంభమైంది.  సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. పార్టీల మద్దతుతో తమ సత్తా చాటేందుకు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. రెండేళ్లుగా రాజకీయ నిరుద్యోగంతో కాలం గడుపుతున్న పలువురు గ్రామ, మండల స్థాయి నాయకులు బరిలో దిగేందుకు(దింపేందుకు) అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
 
 ఏ పల్లెలో చూసినా ఇప్పుడు రిజర్వేషన్లు, అభ్యర్థులు, ఎవరికి ఎవరు మద్ధతు ఇస్తారు, గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా బరిలో దిగిన నేతలు ఇప్పుడు కలుస్తారా, ఎవరు గెలుస్తారు, అన్న చర్చలే ప్రధానంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల మద్దతుతో అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడగా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా అభ్యర్థులు రంగంలో నిలువనున్నారు. మరోవైపు రిజర్వేషన్లు తెచ్చిన చిక్కులతో కొందరు నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో బరిలో నిలవాలని ఈపాటికే డబ్బులు వెచ్చించిన కొందరు నాయకులు రిజర్వేషన్లు తమకు ప్రతికూలంగా రావడంతో నిరాశలో మునిగిపోయారు.
 అధికార యంత్రాంగం సన్నద్ధం
 
 పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారిక ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్లు స్వీకరించేందుకు వీలుగా మండలానికి అధికారులను నియమించారు. వీరికి ఒకరోజు శిక్షణతో పాటు ఎన్నికలకు సంబంధించిన బుక్‌లెట్‌లను అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్లు జిల్లా కేంద్రంలో భద్రపర్చారు. నామినేషన్‌ల ఘట్టం ముగిసిన వెంటనే రంగంలో నిలిచే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్లను ఎంపీడీఓలకు పంపే ఏర్పాట్లు పూర్తి చేశారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్‌తో పాటు మొబైల్ పోలీసింగ్, స్ట్రైకింగ్ ఫోర్సు ఏర్పాటుకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పోలింగ్ సిబ్బంది జాబితా కూడా సిద్ధం చేశారు.
 
 వెబ్ కాస్టింగ్‌కు సంబంధించి బ్యాంక్ సిబ్బందిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలో వెలువడినా దానికి అనుగుణంగా నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి ‘న్యూస్‌లైన్’తో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు