‘సాక్షి’ టీవీకి యూనిసెఫ్ అవార్డు

12 Dec, 2016 13:53 IST|Sakshi
‘సాక్షి’ టీవీకి యూనిసెఫ్ అవార్డు

సాక్షి, హైదరాబాద్‌: సాక్షి టెలివిజన్‌ చానల్‌లో ప్రసారమైన సందేశాత్మక కథనానికి ప్రతిష్టా త్మక యునిసెఫ్‌ అవార్డు దక్కింది. ఆడపిల్లను కడుపులోనే కడతేరిస్తే పండుగలన్నీ వెలవెల బోతాయనే ఇతివృత్తంతో ‘ఆడపిల్లలను కాపాడుకుందాం... బతుకమ్మ సాక్షిగా వారిని బతకనిద్దాం’ అనే సందేశంతో ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన రెండు నిమిషాల నిడివి గల కథనం ఉత్తమ సందేశం విభాగంలో యునిసెఫ్‌ అవార్డుకు ఎంపికైంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ కథనం ప్రసార మైంది.

ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన యునిసెఫ్‌ మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో సాక్షి చానల్‌ ఫీచర్స్‌ ఎడిటర్‌ పూడి శ్రీనివాస్‌రావు, డిప్యూటీ న్యూస్‌ ఎడిటర్‌ పైడి శ్రీనివాస్, ప్రొడ్యూసర్‌ మూర్తి అవార్డును అందుకున్నారు. అవార్డు కమిటీ చైర్‌పర్సన్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రేచల్‌ చటర్జీ, ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, యునిసెఫ్‌ తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జి సోని కుట్టి జార్జ్‌ అతిథులుగా హాజరయ్యారు.అవార్డుల కోసం పలు టీవీ చానళ్ల నుంచి 187 ఎంట్రీలు, పత్రికల నుంచి 172 కథనాలు వచ్చాయి.