బాలల హక్కులను పరిరక్షించుకుందాం

6 Oct, 2016 19:06 IST|Sakshi
బాలల హక్కులను పరిరక్షించుకుందాం

వైవీయూ:
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు ఎస్‌. మురళీధర్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో బాలికలపై వివక్ష నేటికీ కొనసాగడం బాధాకరమన్నారు. బాలల హక్కులను పరిరక్షించడంలో చిత్తశుద్ధి, సమన్వయం ఎంతో కీలకమన్నారు. చిన్నారుల హక్కుల ఉల్లంఘనలను నిర్మూలించేందుకు బాలల హక్కుల పరిరక్షణకై నిరంతర ప్రజా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్టెప్‌ సీఈఓ మమత మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, భార్యగా పలు రూపాల్లో సేవలందించే మహిళలపై వివక్ష వీడాలన్నారు. భ్రూణహత్యలను ఆదిలోనే అడ్డుకునే విధంగా అందరిలో చైతన్యం పెంపొందించాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి. సుబ్బలక్షుమ్మ మాట్లాడుతూ దేశం ప్రగతి, సౌభాగ్యంలో స్త్రీ, పురుషులిద్దరూ రెండు చక్రాల వంటి వారన్నారు. ఏ ఒక్కరి సమతుల్యత దెబ్బతిన్నా ప్రగతి రథం ముందుకు నడవడం కష్టమన్నారు. అనంతరం ఆర్తీ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు పి.వి. సంధ్య, ఐసీడీఎస్‌ అధికారి అరుణకుమారి, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రతినిధి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చిన్నారులు వివిధ దేశనాయకుల వేషధారణలతో హాజరై అలరించారు. కళాశాల మహిళా సాధికారత విభాగం నిర్వాహకురాలు యుగళవాణి, రాజశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు