సీన్‌ రివర్స్‌

5 Jul, 2017 10:57 IST|Sakshi
సీన్‌ రివర్స్‌
► మన్యం పేరు చెబితే ప్రభుత్వ సిబ్బందికి గుండె దడ
► ఎక్సైజ్‌ శాఖలో మాత్రం ఏజెన్సీ పోస్టింగంటే గిరాకీ 
► కాసులు కురిపించే గంజాయిపై మహా మోజు
 
చిన్నారులను బూచోడి పేరుతో భయపెట్టినట్టు.. ప్రభుత్వ సిబ్బందిని ఏజెన్సీ బదిలీ చేస్తామని హెచ్చరిస్తారు. ఆరోపణలొస్తే కొండ కోనల్లోకి విసిరేస్తారు. సాధారణంగా ఏ శాఖలోనైనా జరిగే తంతు ఇది. కానీ ఎక్సైజ్‌ శాఖ రూటే సెప‘రేటు’. మన్యంలో పోస్టింగ్‌ కావాలని కోరుకుంటారు. పైరవీలు చేసి మరీ వేయించుకుంటారు. కాసులు కురిపించే గంజాయి మత్తే అందుకు కారణం. 
 
సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీలో పనిచేయడం కష్టసాధ్యమని ఆ పేరు చెబితేనే ఆమడ దూరం పరిగెడతారు ఏ ఉద్యోగైనా.. బదిలీ జరిగితే ఆపుకోవడానికి నానా పాట్లు పడతారు. సర్వీసులో ఒక్కసారి ఏజెన్సీలో పోస్టింగ్‌ పడితే చాలు.. మళ్లీ అక్కడకు వెళ్లడానికి ససేమిరా అంటారు. ఒకప్పుడు ఎక్సైజ్‌ శాఖలోనూ ఇదే జరిగేది. కానీ గంజాయితో  గడించే సొమ్ముకు అలవాటు పడ్డ కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు ఏరికోరి ఏజెన్సీలో పోస్టింగ్‌లు వేయించుకుంటున్నారు. కాసుల పంట పండించే గంజా యి సాగు, అక్రమ రవాణాను ఎంచుకుని మన్యానికి బదిలీలు చేయించుకుంటున్నారు. మస్తుగా గడించి ఎక్కడెక్కడికో బదిలీ అయినా మళ్లీ ఏజెన్సీకి గాని, అందుబాటులో ఉన్న స్టేషన్‌కు గాని వచ్చేస్తున్నారు. 
 
ఏరికోరి ఏజెన్సీకి..
ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో ఎక్సైజ్‌ ఉద్యోగులు, అధికారులు అక్కడ విధి నిర్వహణ కత్తిమీద సాములా భావించేవారు. పోలీసు యూనిఫాంలో ఉండే వీరు తామెక్కడ మావోయిస్టుల కళ్లలో పడతామోనని భయపడేవారు. కొన్నాళ్లుగా కొంతమంది ఎక్సైజ్‌ అధికారులు రూటు మార్చుకున్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టాల్సిన వారే వాటిని ప్రోత్సహించడం పనిగా పెట్టుకున్నారు. జీవితకాలంలో సంపాదించలేని సొమ్మును ఏడాదిలోగా గడించవచ్చన్న భావనతో వీరు అక్రమార్గం పడుతున్నారు.

కింది నుంచి పై స్థాయి వరకు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునో, ప్రలోభ పెట్టో మళ్లీ మళ్లీ పోస్టింగులు వేయించుకుంటున్నారు. మరికొందరు ఏజెన్సీకి అందుబాటులో ఉండే చోట్లకు బదిలీలు చేయించుకుంటున్నారు. విశాఖ మన్యంలో పాడేరు, అరకుతోపాటు దానికి ఆనుకుని ఉన్న నర్సీపట్నం, మాడుగుల ఎక్సైజ్‌ సర్కిల్‌ స్టేషన్లకు మునుపెన్నడూ లేనంత గిరాకీ ఉంది. ఆ స్టేషన్ల పరిధిలో గంజాయి బాగా సాగవుతోంది. అందువల్ల తమ పంట పండుతుందన్న ఉద్దేశంతో అక్కడ పోస్టింగ్‌లకు పోటీ పడుతున్నారు. గంజాయి సొమ్ము రుచి మరిగిన వీరు సాధ్యమైనంత ఎక్కువ కాలం అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. 


ఉదాహరణకు గతంలో ఒక అధికారి నాలుగేళ్ల వ్యవధిలో పాడేరులో రెండుసార్లు సీఐగా పనిచేశారు. తొలుత రెండేళ్లు పనిచేశాక ఆయనను బదిలీ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆయన తన పలుకుబడితో మళ్లీ అదే స్టేషన్‌కు, అదే హోదాలో వచ్చేశారు. అనంతరం అక్కడ నుంచి పదోన్నతిపై ఆయన కాకినాడ ఏఈఎస్‌గా వెళ్లారు. కొన్నాళ్లే అక్కడ పనిచేసి గాజువాకకు పోస్టింగ్‌ వేయించుకున్నారు. ఇప్పుడాయన తనకు సంబంధం లేని పాడేరుకు తరచూ వెళ్లి వస్తుండడం ఎక్సైజ్‌ శాఖలో పై స్థాయి అధికారులకు తెలిసినా నిలువరించే వారే కరువయ్యారంటూ ఎక్సైజ్‌ శాఖలో కోడై కూస్తున్నారు. మరో సీఐ కూడా గతంలో పాడేరులో పనిచేసి పలుకుబడితో గాజువాకలో పోస్టింగ్‌ వేయించుకున్నారు.

అంతేకాదు.. గతంలో అనకాపల్లి కేంద్రంగా పనిచేసిన ఉన్నతాధికారి బదిలీపై అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న గాజువాకకు బదీలీపై రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. గంజాయి సాగు, అక్రమ రవాణాలో పాలుపంచుకుంటున్న ఆరోపణలతో పాడేరు సీఐ పెదకాపు శ్రీనివాసరావును ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. పెదకాపు వ్యవహారాలన్నీ పెద్ద అధికారులకు తెలిసినా ఉద్దేశపూర్వకంగానే నిలువరించలేదన్న ఆరోపణలున్నాయి. అందుకే దాదాపు ఐదారు నెలలుగా సీఐ పరారీలో ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు కిమ్మనలేదని చెబుతున్నారు. మరోవైపు సీఐ శ్రీనివాసరావుతోపాటు ఆయనతో అంటకాగిన ఉన్నతాధికారుల సంపాదనపై కూడా ఏసీబీ నిఘా ఉంచినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో సంబంధిత ఎక్సైజ్‌ అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. 
 
గతంలో నర్సీపట్నం సీఐ..
గంజాయి కేసులోనే 2015లో నర్సీపట్నం ఎక్సైజ్‌ సీఐ ఎం.జగన్మోహనరావు సస్పెండయ్యారు. గోదాముల్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన గంజాయిని తస్కరించారన్న ఆరోపణలపై ఆయనపై వేటు వేశారు. ఇప్పుడు పాడేరు సీఐ శ్రీనివాసరావు కూడా గంజాయి వ్యవహారంలోనే సస్పెన్షన్‌కు గురయ్యారు.   

 

>
మరిన్ని వార్తలు