హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు

16 Dec, 2016 22:23 IST|Sakshi
హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు
- దాడికి పాల్పడిన 23 మంది అరెస్టు
- రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని ఎస్పీ ఆదేశాలు
- సిద్దపల్లిలో పర్యటన
 
ఆత్మకూరు: పల్లెల్లో హింసను ప్రోత్సహించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దపల్లి గ్రామంలో జరిగిన దాడుల్లో 23 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి వర్గీయులు దరగయ్య కుటుంబంపై కర్రలు, మారణాయుధాలతో దాడికి పల్పడినట్లు తెలిపారు. ఇలా గ్రామాల్లో అల్లర్లకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. నిందితులపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని ఆదేశించారు. మరో 9 మంది పరారిలో ఉన్నట్లు చెప్పిన ఎస్పీ.. త్వరలోనే సీఐ ఎదుట లొంగిపోవాలని వారికి సూచించారు. గ్రామాల్లో  మళ్లీ ఘర్షణలకు తావులేకుండా పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.
 
సిద్దపల్లిలో ఎస్పీ పర్యటన
సిద్దపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులు, అంతకు ముందు చిన్నారులతో మాట్లాడి దాడికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. ఇరువర్గాల వారితో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దెబ్బతిన్న బైకులు, సైకిళ్లు ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ సుప్రజ, సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు సు«ధాకరరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌నాయక్, సిబ్బంది ఉన్నారు. 
>
మరిన్ని వార్తలు