షీ టీమ్‌లతో మరింత భద్రత

14 Jan, 2017 03:00 IST|Sakshi
షీ టీమ్‌లతో మరింత భద్రత

మహిళల సమస్యల పరిష్కారానికి 4 బృందాలు
 రాష్ట్రంలో ప్రథమంగా ఏర్పాటు


నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌ అర్బన్‌) : ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సఖీ, షీ టీమ్‌ల బృందాల ఏర్పాటుపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను వేధింపులకు గురి చేసే అకతాయిలను పట్టుకునేందుకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్‌ల ఏర్పాటయ్యాయి. ఇవి రెండు విభాగాలు మహిళల సంరక్షణ కోసం పనిచేస్తున్నాయి. సఖీ, షీ టీమ్‌లు సంయుక్తంగా పనిచేస్తే మహిళల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని గ్రహించిన కలెక్టర్‌ యోగితారాణా అందుకు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 10న సఖీ, షీ టీమ్‌ అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ సదస్సులో రెవెన్యూ పోలీస్‌ యంత్రాంగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో మహిళలకు ఆ గ్రామంలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా కమిటీలు నియమించేందుకు కసరత్తు చేశారు. ఈ కమిటీలు త్వరలో ఏర్పాటు కానున్నాయి. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సఖీ, షీ టీమ్‌ కమిటీలు ఏర్పాటు కాబోతున్నాయి.  

గ్రామస్థాయి సఖీ, షీ టీమ్‌ కమిటీ..
గ్రామ స్థాయిలో మహిళలు తమ సమస్యలను గ్రామ స్థాయిలో ఉన్న జెండర్‌ కమిటీ సభ్యులకు తమ సమస్యను ఫిర్యాదు చేయాలి. జెండర్‌ కమిటీ సభ్యులే గ్రామంలో గల సమస్యలను తెలుసుకుని గ్రామస్థాయి సఖీ, షీ కేంద్రంలో కమిటీ సభ్యులతో కౌన్సిలింగ్‌ నిర్వహించి సమస్యలను పరిష్కారిస్తారు. జెండర్‌ కమిటీలో ఆ గ్రామంలో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, వీఆర్‌వో, గ్రామ సర్పంచ్, మండల కమిటీలో చైర్మన్‌గా తహసీల్దార్, ఎస్‌హెచ్‌ఓ కన్వీనర్, కమిటీలు సభ్యులుగా ఏపీఎం, మండల విద్యాశాఖ అధికారి తదితరులు ఉంటారు. డివిజన్‌ స్థాయిలో కమిటీ చైర్మన్‌గా సబ్‌ కలెక్టర్‌ లేదా, ఆర్‌డీఓ, కన్వీనర్‌గా సబ్‌డివిజన్‌ పోలీస్‌ అధికారి(డీఎస్పీ), కమిటీ సభ్యులుగా డివిజన్‌ స్థాయి న్యాయ సేవాసంస్థ అధికారి, సీఐ తదితరులు ఉంటారు. జిల్లా స్థాయి కమిటీలో కమిటీ చైర్‌పర్సన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా పోలీస్‌ కమిషనర్, సభ్యులుగా ప్రతి ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులు ఉంటారు.
 

మరిన్ని వార్తలు