ఆకాశ వీధిలో..

14 Jan, 2017 03:19 IST|Sakshi
ఆకాశ వీధిలో..

హెలికాప్టర్‌ సవారీపై నగరవాసులు ఫిదా

  • విశ్వనగరి అందాల విహంగ వీక్షణతో అమితానందం
  • సందర్శకులను తన్మయత్వంలో ముంచెత్తిన హెలీ రైడ్‌
  • కుటుంబ సభ్యులతో కలసి నగరాన్ని చుట్టిన చందూలాల్‌

సాక్షి, హైదరాబాద్‌: చూసే మనసుండాలేగానీ భాగ్యనగరి అణువణువూ సోయగాల బృందావనమే. మహానగరానికి నలుదిశలా విస్తరించిన చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు, హైకోర్టు, అసెంబ్లీ, ఉస్మానియా ఆస్పత్రి, ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్‌జంగ్‌ మ్యూజియం, బిర్లామందిర్, హుస్సేన్‌ సాగర్‌ వంటి చారిత్రాక ప్రదేశాలను ఏకకాలంలో చూడటం సందర్శకుల కనులకు విందే. ‘గగన విహారం’ ద్వారా విశ్వనగరి అందాలను నింగి లో ఎగురుతూ వీక్షించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది హెలీ టూరిజం. హుస్సేన్‌ సాగర్‌ తీరంలో తాజాగా ప్రారంభించిన ‘హెలీ రైడ్‌’కు విశేష ఆదరణ లభిస్తోంది. విహంగ వీక్షణంతో సందర్శకులను తన్మయత్వంలో ముంచెత్తడంతో పాటు పర్యాటక శాఖ ప్రతిష్టనూ పెంచుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ముత్యాల నగరానికి ‘గగన విహారం’ మరో మణిహారంగా మారింది.

ప్రారంభమైన రోజే హుషారుగా..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో పర్యాటక శాఖ చేపట్టిన ఈ హెలీ టూరిజం శుక్రవారం ప్రారంభమైన రోజే ఘనమైన ఆదరణ పొందింది. తొలిరోజే 100 మందికిపైగా పర్యాటకులు హెలికాప్టర్‌లో నగరాన్ని చుట్టివచ్చారు. నింగికెగిరిన హెలికాప్టర్‌ పక్షిలా దూసుకెళ్తూ.. మలుపు తిరుగుతూ మురిపిస్తుండటం చిన్నారులనే కాదు పెద్దలను సైతం ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఈ అరుదైన అనుభూతిని ఆస్వాదించేందుకు నగరవాసులు, పర్యాటకులు ఆసక్తి చూపుతుండటంతో జాయ్‌రైడ్స్‌ జోరందుకున్నాయి. పైలట్స్‌గా విశేష అనుభవం కలిగిన కెప్టెన్‌ సునీల్, ప్రణవ్‌ హెలీ రైడ్‌కు నేతృత్వంగా వ్యవహరించారు.

రెగ్యులర్‌గా నడిపిస్తాం..: చందులాల్‌
హెలీరైడ్‌ రెగ్యులర్‌గా నడిపిస్తామని పర్యాటక మంత్రి అజ్మీరా చందులాల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులతో కలసి హెలికాప్టర్‌లో నగరాన్ని చుట్టివచ్చారు. సాధారణ రేట్లతోనే హెలికాప్టర్‌లో తిరిగిన అనుభూతి నగరవాసులు పొందవచ్చని, ప్రజలందరూ సంక్రాంతిని పురస్కరించుకుని ప్రారంభించిన హెలీ టూరిజాన్ని ఉపయోగించు కోవాలని కోరారు. నింగి నుంచి హైదరాబాద్‌ అందాలు తమను మంత్రముగ్ధుల్ని చేశాయని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొనటం విశేషం.

నగరవాసులు విరివిగా తరలి రావాలి..
మంచి ఆఫర్స్‌ ఇస్తున్నామని తుంబి ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ గోవింద్‌ నయ్యర్‌ తెలిపారు. ఒక్కరికైతే రూ.3,500, ఒక ఫ్యామిలీలో నలుగురితో వస్తే ఒక్కొక్కరికి రూ. 3 వేలు, అదే 12 మంది ఉన్న ఫ్యామిలీతో గ్రూప్‌గా వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 మాత్రమే టికెట్‌ ధర చెల్లించవచ్చన్నారు. మేరా ఈవెంట్స్‌ డాట్‌ కమ్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చన్నారు. ఒక్కొక్క ట్రిప్‌కు 12 మంది వెళ్లవచ్చని, 17 వరకు హెలీ టూర్‌ నడిపిస్తామని చెప్పారు.

సందర్శకులు మురిసిపోతున్నారు: పైలట్లు
హెలికాప్టర్‌లో కూర్చున టూరిస్టులు గగనతలం నుంచి నగరాన్ని చూసి మురిసిపోతున్నారని పైలట్లు సునీల్, ప్రణవ్‌ చెప్పారు. 1,500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్‌ను నడపుతున్నామని ఇది బెస్ట్‌ వ్యూ అని తెలిపారు. ఆకాశం నుంచి హైదరాబాద్‌ అందాలు చూడముచ్చటగా ఉన్నాయన్నారు.

జీవితంలో మరువలేం..
గగనతలంలో ప్రయాణించటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఈ అనుభూతిని జీవితంలో మరువలేను. అదీ బోగి పండుగ రోజున. ఈ మధురానుభూతిని కల్పించిన టూరిజం శాఖకి కృతజ్ఞతలు.
    – శ్రావణ్‌ కుమార్, మాల్కాజ్‌గిరి

తన్మయత్వానికి లోనయ్యా..
హెలికాప్టర్‌లో ప్రయాణంతో తన్మయత్వా నికి లోనయ్యా. నగర అందాలు చాలా బాగున్నాయి. నా పిల్లలు ఉద్దమ్, తివిద్‌ నగరాన్ని పై నుంచి చూసి మురిసిపోయా రు. టూర్‌ చాలా బాగా అనిపించింది.    
    – దీప్తి, మల్కాజ్‌గిరి

మరిన్ని వార్తలు