కథలు చెప్పొద్దు

20 Sep, 2017 12:45 IST|Sakshi
జిల్లా అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌

జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంది.
ఒక్కో గ్రామంలో 300 మంది జ్వర పీడితులున్నారు
56 మండలాల్లో ఇదే పరిస్థితి
ఎక్కడా డాక్టర్లు సరిగ్గా లేరు.. సరైన మెడిసిన్‌ లేదు
మీవల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది
పద్దతి మార్చుకొని ప్రజారోగ్యంపై     దృష్టి సారించండి
వైద్యాధికారులపై మంత్రి శిద్దా ఫైర్‌


ఒంగోలు టౌన్‌ :
‘ప్రతి గ్రామంలో 250 నుంచి 300 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంటే డాక్టర్స్‌ ఎక్కడా కరెక్ట్‌గా లేరు. సరైన మెడిసిన్‌ లేదు. అదేమని అడిగితే స్టోరీలు చెబుతున్నారు. పద్ధతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. జ్వరాలు మాత్రం కంట్రోల్‌ కావాలి’అని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. జిల్లాలో జ్వరాల తీవ్రత  నేపథ్యంలో మంగళవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో వైద్యాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లాలో 96,524 మంది జ్వర బాధితులు: డీఎంహెచ్‌ఓ
జిల్లాలో గతేడాది 1,12,254 మంది సాధారణ జ్వరాలతో బాధపడగా.. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 96,524 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.యాస్మిన్‌ వెల్లడించారు.  ఈ ఏడాది జనవరిలో 11, ఫిబ్రవరిలో 25, మార్చిలో 21, ఏప్రిల్‌లో 28, మే నెలలో 19, జూన్‌లో 7, జూన్‌లో 13, జూలైలో 13, ఆగస్టులో 53, సెప్టెంబర్‌లో 91 డెంగీ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ డెంగీ కేసులు పెరిగాయన్నారు.

మంత్రి శిద్దా జోక్యం చేసుకుంటూ తాను 15 రోజుల కిందట దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేరని, మందులు కూడా లేవన్నారు. అదే సమయంలో ఒక ఆర్‌ఎంపీకి చెందిన చిన్న షెడ్‌లో 50 మంది జ్వర పీడితులు ఉన్నారని, బెడ్స్‌ లేకపోవడంతో చాపలు, నాపరాళ్లపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారన్నారు. ఎంత చెప్పినా మార్పు రావడంలేదని, మీవల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఒంగోలులో కూర్చుంటే కుదరదని, సరైన డైరెక్షన్‌ ఇస్తూ జ్వరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సక్రమంగా పనిచేయకపోతే సస్పెండే: కలెక్టర్‌
జిల్లాలో వ్యాధులను నియంత్రించేందుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వి. వినయ్‌చంద్‌ ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే వైద్యులు, వైద్యులైనా, వైద్య సిబ్బంది అయినా, పంచాయతీ కార్యదర్శులైనా సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్యంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏరోజుకారోజు తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఒంగోలుతో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లో జనావాసాల మధ్య పందులు పెంచకుండా ఉండేందుకు, వాటి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

20 రోజుల్లో జిల్లాకు ప్లేట్‌లెట్స్‌ మెíషీన్‌: మంత్రి శిద్దా
20 రోజుల్లో జిల్లాకు ప్లేట్‌లెట్స్‌ మెషీన్‌ వస్తోందని మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లేట్‌లెట్స్‌ మెషీన్‌కు సంబంధించి టెండర్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో డెంగీతో ఎవరూ చనిపోలేదని,  వివిధ అనారోగ్య కారణాలతోనే చనిపోయారని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు