సిరిసిల్ల జిల్లా అసాధ్యం

8 Sep, 2016 10:09 IST|Sakshi
సిరిసిల్ల జిల్లా అసాధ్యం
  • జిల్లాకేంద్రం స్థాయిలో అభివృద్ధి చేస్తా 
  • సిరిసిల్లకు ప్రత్యేక ప్యాకేజీ సాధిస్తా
  • జీవిత కాలం సిరిసిల్లను వీడను
  • టీఆర్‌ఎస్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌
  • హైదరాబాద్‌లో సుదీర్ఘ చర్చ 
  • సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావు మౌనం వీడారు. సిరిసిల్లను జిల్లా చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మంత్రిని కలిసి జిల్లా ఏర్పాటుపై విన్నవించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం... సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటులో సిరిసిల్ల జిల్లా సాధ్యాసాధ్యాలను పరిశీలించిందని వివరించారు. ఎవరూ అడగకపోయినా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం ప్రతిపాదించానని అన్నారు. జనాభా, మండలాలు సరిపోలేదని, అందుకే సిరిసిల్ల జిల్లాను పక్కన పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.
     
    జిల్లా కేంద్రంతో పోటీగా అభివృద్ధి..
    జిల్లా కేంద్రంతో పోటీగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని సాధిస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. సిరిసిల్ల నుంచి ఒక్క డివిజన్‌ ఆఫీస్‌ కూడా తరలిపోదని, ఇంకా కొన్ని ఆఫీసులు కొత్తగా వస్తాయని వివరించారు. సిరిసిల్లకు వచ్చి ఈ విషయాలన్ని ప్రజలకు వివరిస్తానని తెలిపారు. తమను రాజీనామా చేయాలని స్థానికంగా ఒత్తిడి పెరుగుతోందని టీఆర్‌ఎస్‌ నాయకులు వాపోయారు. మనం ఎన్నికల్లో సిరిసిల్లను జిల్లా చేస్తామని హామీ ఇవ్వలేదని, ఎవరేం అన్నా రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు. తాను ఇప్పుడు సిరిసిల్లకు వచ్చి ఈ విషయాలు చెబితే కొందరికి ఇష్టం ఉండదని కేటీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. 
     
    సిరిసిల్లను వీడను..
    తాను భవిష్యత్‌లో సిరిసిల్లలో పోటీ చేయనని, మరో చోట నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని కేటీఆర్‌ ఖండించినట్లు తెలిసింది. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల నుంచే జీవితకాలం పోటీ చేస్తానని చెప్పారు. ఓడినా గెలిచినా సిరిసిల్లను వీడేది లేదని స్పష్టం చేశారు. ముస్తాబాద్‌ మండలం సిద్దిపేటలో కలిసినా అభివృద్ధి విషయంలో ఏ మార్పు ఉండదని మంత్రి వివరించినట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమం బలంగా సాగుతున్న తరుణంలో మంత్రి కేటీఆర్‌ మౌనం వీడి టీఆర్‌ఎస్‌ నేతలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు సమాచారం. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామల పావని, వైస్‌ చైర్మన్‌ తవుటు కనకయ్య, సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ జిందం చక్రపాణి, వైస్‌ చైర్మన్‌ లగిశెట్టి శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లుగారి నర్సాగౌడ్, అగ్గిరాములు, పబ్బతి విజయేందర్‌రెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, మంచె శ్రీనివాస్, తోట ఆగయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. 
>
మరిన్ని వార్తలు