చౌడు మిద్దె కూలి ఆరుగురు మృతి

26 Jul, 2016 23:34 IST|Sakshi
చౌడు మిద్దె కూలి ఆరుగురు మృతి

మైదుకూరు టౌన్‌:
వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చౌడు మిద్దె కూలిన సంఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల బంధువుల కథనం మేరకు.. ఉత్సలవరం గ్రామానికి చెందిన అంగంపల్లె చిన్న గుర్రప్ప, పెంచలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు, కుమారుడికి వివాహం కావడంతో  కుమారుడు
పక్కనే ఇంటిలో వేరుగా కాపురం ఉన్నాడు. అయితే  చిన్నగుర్రప్ప దంపతులు, వారి పెద్ద కుమార్తె లలితలు ఒకే ఇంటిలో నివాసముంటున్నారు. లలితకు వివాహమైనప్పటికీ కుటుంబ తగాదాల కారణంగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈమెకు యశ్వంత్‌ అనే కుమారుడు ఉన్నాడు. చిన్నకూతురైన హరిత బ్రహ్మంగారిమఠం మండలం పెద్దురాజుపల్లె గ్రామంలో వివాహం చేసుకోగా ఆమెకు నవనీత్, నిహారిక అనే పిల్లలు ఉన్నారు.

 

చిన్న కుమార్తె హరిత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ కోసం సోమవారం సాయంత్రం పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున వర్షం రావడంతో బాగా తడిచి ఉన్న పైకప్పు ఒక్కసారిగా ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్దం రావడంతో పక్కనే నివాసమున్న కొడుకు, గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసే సరికి చిన్నగుర్రప్ప(50), పెంచలమ్మ(44), హరిత(23), యశ్వంత్‌(6), నవనీత్‌(2) అక్కడికక్కడే మృతి చెంది ఉన్నారు.  లలిత(27), నిహారిక (9నెలలు) కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో వారిని ప్రొద్దుటూరు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లలిత మృతి చెందగా కేవలం 9నెలల నిహారిక మృత్యుంజయురాలుగా నిలిచింది. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. విషయం తెలిసిన వెంటనే సంఘటన  స్థలాన్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 

>
మరిన్ని వార్తలు