15 రోజుల్లో క్రమబద్ధీకరణ

24 Aug, 2016 00:47 IST|Sakshi
15 రోజుల్లో క్రమబద్ధీకరణ
సాక్షి, విశాఖపట్నం: వంద గజాల్లోపు ఆక్రమిత కట్టడాల క్రమబద్ధీకరణను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. జీవో–296 జారీ చేసి ఏడాదైనా నేటికీ పట్టాలు పంపిణీ చేయకపోవడంపై ఇటీవల సాక్షిలో ప్రచురితమైన కథనంపై స్పందించిన కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. క్రమబద్ధీకరణ కోసం అంగీరించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత మండల తహశీల్దార్లకు అందజేయాలన్నారు. తిరస్కరించిన వారి జాబితాలను వార్డుల వారీగా డిస్‌ప్లే చేయాలన్నారు. అభ్యంతరాలుంటే తహశీల్దార్లను సంప్రదించాలన్నారు. మిగిలిన దరఖాస్తుదారులకు సంబంధించి సర్వే కోసం ప్రత్యేక బందాలను వెంటనే పంపాలన్నారు. సర్వే బందాలు వచ్చే సమయంలో దరఖాస్తు చేసుకున్న వారు ఇంటి వద్దే ఉండి వారికి సహకరించాలని సూచించారు. క్రమబద్ధీకరణ సర్వే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఎక్కువ సర్వే బందాలను నియమించాలని సూచించారు. త్వరగా సర్వే జరిగేలా చూడాలని సర్వే శాఖ ఏడీ, ఆర్డీవోలను ఆదేశించారు. జీవో.118ను అనుసరించి వంద గజాలకు పైబడి ఆక్రమిత కట్టడాలు, జీవో 301 ప్రకారం గాజువాక హౌస్‌ కమిటీ పరిధిలో దరఖాస్తు చేసుకున్నవారి కోసం నెల రోజుల్లోగానే దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ జె.నివాస్, డీఆర్‌వో చంద్రశేఖరరెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, సర్వే శాఖ ఏడీ మనీషా త్రిపాఠి, నగర పరిధిలోని తహశీల్దార్లు, సెక్షన్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
 
విపత్తుల ఉపశమన ప్రాజెక్టు పనులను పూర్తి చేయండి
ఏపీ విపత్తుల ఉపశమన ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పనులు వేగంగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులకు సూచించారు. మంగళ వారం కలెక్టర్‌ చాంబర్‌లో ఏపీ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈపీడీసీఎల్, జీవీఎంసీ, వుడా, అటవీ, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్, బీఎస్‌ఎన్‌ఎల్‌ శాఖలకు ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన నిధులపై ఆరా తీశారు. చేపట్టిన పనులు వేగంగా జరిగేలా చూడాలని, ఇంకాచేపట్టని పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. 26న రెవెన్యూసెక్రటరీ జేసీ శర్మ ఈ పనులను సమీక్షించనున్నారని కలెక్టర్‌ చెప్పారు. జూ ఆధునికీకరణ పనులకు కన్సల్టెంట్‌ కోసం ఎదురు చూస్తున్నామని అటవీశాఖ అదనపు చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రతీప్‌కుమార్‌ వివరించారు.
>
మరిన్ని వార్తలు