కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

11 Aug, 2016 22:05 IST|Sakshi
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల యాత్రికుల సౌకర్యార్థం ఏలూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ఏలూరు డిపో మేనేజర్‌ ఎ.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు డిపో నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో 20 నాన్‌స్టాప్‌ సర్వీసులను తిప్పుతుండగా, పుష్కరాల సందర్భంగా మరో 12 నాన్‌స్టాప్‌ సర్వీసులను తిప్పడానికి నిర్ణయించామన్నారు. అలాగే ఏలూరు, ద్వారకా తిరుమల ప్రాంతాల నుంచి నిత్యం 7 పల్లె వెలుగు సర్వీసులు తిప్పుతున్నామని, పుష్కరాల సందర్భంగా మరో 5 సర్వీసులను పెంచామన్నారు.
ప్రత్యేక సర్వీసులుగా తిప్పుతున్నప్పటికీ టిక్కెట్‌ ధరలు సాధారణ రోజుల్లో ఉండే ధరలే వసూలు చేస్తామన్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఈ బస్సులు యాత్రికులకు అందుబాటులో ఉంటాయని, ఈ బస్సులు విజయవాడ రామవరప్పాడు , రింగురోడ్డుకు సమీపంలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వరకు మాత్రమే వెళ్తాయని తెలిపారు. అక్కడ నుంచి పుష్కర ఘాట్లకు ప్రభుత్వం ఉచిత బస్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. 
 
మరిన్ని వార్తలు