గృహ నిర్మాణాల్లో వేగం పెరగాలి

6 May, 2017 22:57 IST|Sakshi
గృహ నిర్మాణాల్లో వేగం పెరగాలి
 
– మంత్రి కాల్వ శ్రీనివాసులు
 
కర్నూలు(అర్బన్‌): గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలని రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతో కలిసి గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 10 లక్షల మంది గృహ వసతి లేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 40 శాతం గృహ నిర్మాణాలు కూడా పూర్తి కాలేదని, ఈ నెలాఖరు నాటికి కేటాయించిన లక్ష్యాల్లో 60 శాతం పూర్తి చేయాలన్నారు. ఇసుక, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు.
 
రాష్ట్రంలో కర్నూలు జిల్లా 13వ స్థానంలో ఉందని, వచ్చే రెండేళ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మొదటి స్థానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో నాగులదిన్నె, వేముగోడు రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కలెక్టర్‌ను కోరారు. జోహరాపురం కాలనీలో నిర్మించిన గృహాల్లో లబ్ధిదారులు నివాసం ఉంటడం లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి కోరారు. సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, హౌసింగ్‌ పీడీ హుసేన్‌సాహెబ్‌, గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు