హోదా వచ్చేవరకు ఉద్యమం

10 Aug, 2016 18:04 IST|Sakshi
హోదా వచ్చేవరకు ఉద్యమం
మీ స్వార్థం కోసం జనం..
ప్రయోజనాలు తాకట్టు పెడతారా?
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి, 
ఎమ్మెల్యే పీఆర్కే వెల్లడి
 
మాచర్ల : ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న టీడీపీ, బీజేపీలు.. ఇప్పుడు హోదా సంజీవని కాదని, ప్యాకేజీలు ఇస్తామని మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. ఈ తీరును వ్యతిరేకిస్తూ తొలినుంచీ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం అత్యంత దారుణమన్నారు. మంగళవారం స్థానిక కేసీపీ అతిథి గృహంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలూ ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతున్నా టీడీపీ, బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలతో ప్యాకేజీల గురించి మాట్లాడటంపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు హోదా ఇవ్వాలని వాదించిన బీజేపీ అధికారంలోకొచ్చాక చట్టంలో లేదని, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని మాట్లాడటం నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం హోదా విషయంలో ఆత్మవంచన చేసుకుంటూ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు.
 
ప్రత్యేక హోదాతో అన్ని రకాలుగా ప్రయోజనం..
పా్యకేజీ అనేది ఒకేసారి ఇస్తారని, ప్రత్యేక హోదా వస్తే అన్ని విధాలుగా ప్రయోజనం ఉంటుందని, దీనిని తెలుసుకోకుండా చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు రోజుకోరకంగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నార ని, త్వరలోనే వారికి బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని జగన్‌మోహన్‌రెడ్డి కలిస్తే చంద్రబాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తూ వార్తలు ప్రచురించటం బాధాకరమన్నారు. వీటన్నింటినీ ప్రజలకు వివరించి ప్రత్యేక హోదా సాధించేవరకు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
 
పుష్కరాలకు రాజకీయ రంగు..
పుష్కర స్నానాలు భక్తుల మనోభావాలకు సంబంధించినవని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పల్నాడులో నాలుగు నెలలుగా మంచినీటి కోసం ఇబ్బంది పడుతుంటే నీటి సమస్య పరిష్కారానికి డబ్బులు లేవని చెప్పిన ప్రభుత్వం పుష్కరాల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తోందన్నారు. సొంత డబ్బులా పుష్కర ఘాట్లకు పార్టీ రంగులు వేయటం దారుణమన్నారు. పార్టీ మీద ప్రేమ ఉంటే సొంత డబ్బుతో ఘాట్ల నిర్మించి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బుతో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. సమావేశంలో పార్టీ యువజన lసంఘం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు