ఆద్యంతం.. రాగరంజితం..

2 Sep, 2016 22:22 IST|Sakshi
ఆద్యంతం.. రాగరంజితం..
తెనాలి: శ్రీసీతారామ గానసభ సంగీతోత్సవాల్లో భాగంగా శుక్రవారం విశాఖకు చెందిన సంగీత విద్వాంసురాలు సోమయాజుల సుబ్బలక్ష్మి గాత్రకచేరీ ఆద్యంతం శ్రోతలను ఆకట్టుకుంది. స్థానిక మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కల్యాణ మండపంలో రెండున్నర గంటలకుపైగా సాగిన కచేరీలో ప్రేక్షకులు సుబ్బలక్ష్మి కీర్తనలతో మంత్రముగ్ధులయ్యారు. వయొలిన్, మృదంగ విద్యాంసులు   రామచరణ్, రామకృష్ణ తమ ప్రావీణ్యంతో కచేరీని రక్తి కట్టించారు. వీరి కుమార్తె విష్ణుప్రియ ఇందిర సోమయాజులు ముత్తుస్వామి దీక్షితులు రచించిన ఆనందామృతకర్పిణి కృతిని అమృతవర్షిణి రాగం, ఆదితాళంలో గానం చేసింది. మరొక కృతి కైలాసనాథేనను కాంభోజిరాగంలో మిశ్రచాపు తాళంలో పాడి అభినందనలు అందుకుంది.
 
సంగీత నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి పద్మభూషణ్‌ నూకల చినసత్యనారాయణ, కొక్కొండ సుబ్రహ్మణ్యశర్మ, ప్రస్తుతం మందా సుధారాణి వద్ద సంగీతంలో అభివృద్ధి  చెందుతున్నారు. విశాఖలోని హంస అకాడమీలో ముఖ్యభూమికను పోషిస్తున్నారు. ఇంగ్లిష్, సంగీతంలోనూ పీజీ చేశారు. ఆలిండియా రేడియోలో బీహై గ్రేడెడ్‌ ఆర్టిస్టుగా దక్షిణ భారతదేశంలోని అనేక ప్రదేశాల్లో కచేరీలు చేశారు. మరో వైపు తాను స్వయంగా సంగీత శిక్షకురాలిగా పలువురికి శిక్షణనిస్తున్నారు.
 
 
 
మరిన్ని వార్తలు