ఉద్యాన పంటల సాగుకు రూ.32 కోట్లు రాయితీ

3 Feb, 2017 00:22 IST|Sakshi
ఉద్యాన పంటల సాగుకు రూ.32 కోట్లు రాయితీ
లింగపాలెం : 2016–17 ఆర్థిక సంవత్సరం నాటికి జిల్లాలో ఉద్యానపంటలు సాగు చేసే రైతులకు రూ.32 కోట్ల సబ్సిడీని అందించే లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా ఉద్యానపంటల ఉప సంచాలకుడు వైవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. ఉద్యాన పంటల పథకం రాయితీలపై ధర్మాజీగూడెంలో రైతులకు గురువారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి రైతు ఉద్యాన పంటలను సాగు చేసి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని సూచించారు. ఈ పంటలు సాగుచేసే రైతులకు రాయితీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. సబ్సిడీపై యంత్రాలను అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది జిల్లాలో లక్షా 46 వేల హెక్టార్లలో రైతులు ఉద్యాన పంటలు సాగు చేశారన్నారు. ఇప్పటికి రూ.20 కోట్లు సబ్సిడీ కింద రైతులకు అందించినట్టు ప్రసాద్‌ తెలిపారు. ఉద్యాన పంటలకు సంబంధించి నిమ్మ, బొప్పాయి, శాశ్వత పందిళ్లపై సాగుచేసే కూరగాయలు, అరటి, నర్సరీల్లో నారు పెంపకాలు, పువ్వులు, ఆయిల్‌పామ్‌ సాగుచేసే రైతులకు సబ్సిడీలు అందించనున్నట్టు చెప్పారు. 2017–18 సంవత్సరానికి రూ.50 కోట్ల వరకు రాయితీలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఉద్యాన పంటలు సాగు చేస్తున్నప్పటికీ సబ్సిడీలు రావటం లేదని పలువురు రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పంటలను ఎక్కువ మంది సాగు చేస్తున్నా చాలాతక్కువ మందికి సబ్సిడీలు అందుతున్నాయని పేర్కొన్నారు. సబ్సిడీలు అందని రైతుల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గారపాటి భజ్జియ్య, ఏపీఎంఐపీ పీడీ ఎస్‌.రామ్మోహనరావు, ఉద్యానపంటల ఏడీ ఎ. దుర్గేష్, అసిస్టెంట్‌ సెరీకల్చర్‌ ఆఫీసర్‌ కె.రంగారావు, ఉద్యాన శాఖ ఏవో సంతోష్‌ పాల్గొన్నారు.  
 
 
 
మరిన్ని వార్తలు