స్వైన్‌ ఫ్లూ కలకలం!

12 Mar, 2017 23:15 IST|Sakshi
స్వైన్‌ ఫ్లూ కలకలం!

– నాలుగేళ్ల బాలికకు స్వైన్‌ఫ్లూ
– తనకల్లు మండలంలో వెలుగుచూసిన ఘటన
– తిరుపతిలో చికిత్స పొందుతున్న తల్లీబిడ్డ
– సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన
– ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు మృత్యుఒడికి
– నిద్రమత్తు వీడని వైద్య ఆరోగ్యశాఖ

 
అనంతపురం మెడికల్‌ :  స్వైన్‌ ఫ్లూ మహమ్మారి ‘అనంత’ను వీడడం లేదు. ఈ వ్యాధితో నెల వ్యవధిలోనే ఇద్దరు మృత్యువాత పడగా తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఎండలు మండుతున్నా, స్వైన్‌ ఫ్లూ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా సరిహద్దు గ్రామాల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. ఓ వైపు జనం మృత్యువాత పడుతున్నా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. కనీసం ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు.

నాలుగేళ్ల చిన్నారికి స్వైన్‌ ఫ్లూ
తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన నాలుగేళ్ల చిన్నారి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు చిత్తూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. రెండ్రోజు క్రితం ఈ చిన్నారికి ‘స్వైన్‌ ఫ్లూ’ నిర్ధారణ అయింది. దీంతో బిడ్డతో పాటు తల్లికి కూడా తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సాధారణంగా ఒక ఇంట్లో స్వైన్‌ఫ్లూ ఉంటే కుటుంబంలోని వారికి సొకే అవకాశం ఉన్న నేపథ్యంలో తల్లికి కూడా చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఆమె కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని, నివేదికలు వస్తే స్వైన్‌ ఫ్లూ సోకిందా లేదా అన్నది తేలుతుందని చెప్పారు. కాగా స్థానిక వైద్యాధికారులు రెండ్రోజులుగా అప్రమత్తమై ఎర్రబల్లిలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో 88 కుటుంబాలుండగా 350 మంది జనాభా ఉన్నారు. మరో రెండ్రోజులు శిబిరం కొనసాగించనున్నారు.

గత నెలలో ఇద్దరు మృత్యువాత :
స్వైన్‌ ఫ్లూ దెబ్బకు ఇప్పటికే జిల్లాలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఫిబ్రవరి 15న పెద్దపప్పూరు మండలం చాగల్లులో 8 నెలల బాలుడు మృతి చెందాడు. ఈ బాలుడికి వ్యాధి నిరోధక శక్తి క్షీణించడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించగా వ్యాధి నిర్ధారణ చేశారు. అక్కడి వైద్యులు వేలూరు సీఎంసీకి రెఫర్‌ చేయగా తల్లిదండ్రులు స్వగ్రామానికి వచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బాలుడికి అనంతపురంలో చికిత్స అందించడానికి ప్రయత్నం చేస్తుండగానే మృత్యు ఒడికి చేరాడు.  ఫిబ్రవరి 24వ తేదీన ఆత్మకూరుకు చెందిన ఓ వ్యక్తి (54) స్వైన్‌ఫ్లూతో చనిపోయాడు. కర్నూలు జిల్లా మహానందిలో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన ఇతడికి స్వైన్‌ఫ్లూ సోకింది. తిరుపతిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.  

నిర్లక్ష్యం మత్తులో వైద్య ఆరోగ్యశాఖ :  
జిల్లాలో స్వైన్‌ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మన జిల్లాలోని సరిహద్దు గ్రామాల వారు వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. తాజాగా వ్యాధి బారిన పడిన చిన్నారి కూడా చిత్తూరుకు వైద్యం కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కరపత్రాలు ముద్రించి పంచాలని సాక్షాత్తూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కలెక్టర్‌లు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. ఒక్క కరపత్రాన్ని కూడా ముద్రించిన దాఖలా లేదు. వ్యాధి నియంత్రణకు ముందస్తు జాగ్రత్త చర్యలూ తీసుకోవడం లేదు.

మరిన్ని వార్తలు