అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

27 Jul, 2016 17:35 IST|Sakshi
అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి

మొయినాబాద్‌: విద్యార్థులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకుని భావిభారత పౌరులుగా ఎదగాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. అబ్దుల్‌ కలాం ప్రథమ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్‌లో సురాజ్య భారత్‌ స్టూడెంట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు అబ్దుల్‌ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన గొప్ప మహనీయుడు అబ్దుల్‌ కలాం అన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉపాధ్యాయుడిగా, శాస్త్రవేత్తగా పనిచేసి దేశ రాష్ట్రపతి అయి అనేక సేవలందించారని కొనియాడారు. భారత రాష్ట్రపతి అయికూడా సాధారణ జీవితం గడిపిన అసాధారణ వ్యక్తి కలాం అన్నారు. విద్యార్థులు అబ్దుల్‌ కలాంను స్ఫూర్తిగా తీసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశానికి సేవలందించే సైనికులుగా తయారు కావాలన్నారు.

             రిటైర్డ్‌ ఐఏఎస్‌, ప్రముఖ కవి డాక్టర్‌ జే.బాపిరెడ్డి మాట్లాడుతూ అబ్దుల్‌ కలాంకు విద్యార్థులంటే ఎంతో ఇష్టమని.. ఆయన ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నా విద్యార్థులతోనే ఎక్కువగా మాట్లాడేవారన్నారు. కలాం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించి విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు విజయ్‌ ఆర్య, కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మిడి వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొంపల్లి అనంతరెడ్డి, ఎంఈఓ వెంకటయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గున్నాల రాంచంద్రారెడ్డి,  సర్పంచ్‌లు గీతావనజాక్షి, సుధాకర్‌యాదవ్‌, ఎంపీటీసీ సభ్యులు మాధవరెడ్డి, మాణిక్‌రెడ్డి, మంగలి పెంటయ్య, ప్రధానోపాధ్యాయుడు కుమారస్వామి, నాయకులు ఈగ రవీందర్‌రెడ్డి, పద్మారావు, మాణెయ్య, హరినాథ్‌, వివిధ ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు