ఉసురు తీస్తున్న ఉపాధి

18 Mar, 2017 00:42 IST|Sakshi
ఉసురు తీస్తున్న ఉపాధి
ఏలూరు (మెట్రో) : పెదపాడు మండలం ఎస్‌.కొత్తపలి్లకి చెందిన ఇతని పేరు బూర్లు శ్రీనివాసరావు. ఈనెల 14న అదే గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చెరువులో పూడిక తొలగింపు పనులు చేస్తుండగా.. అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. పనులు చేపట్టిన ప్రాంతంలో ప్రథమ చికిత్స కిట్, ఎండనుంచి రక్షణ కల్పించేందుకు గుడారం వంటి సౌకర్యాలు కల్పించి ఉంటే అతడి ప్రాణాలు దక్కేవి. అలాంటి ఏర్పాట్లేవీ చేయకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. పనిచేస్తేనే కాని పూట గడవని పేదలు ఏటా వేసవిలో ఉపాధి పనులకు వెళుతున్నారు. ఎండవేడిమి తాళలేక కొందరు మరణిస్తున్నారు. గతేడాది జిల్లాలో ఉపాధి హామీ పనులు చేస్తూ ఇద్దరు కూలీలు మృత్యువాతపడగా, తాజాగా ఒకరు మరణించారు.
సౌకర్యాలేవీ
పనిచేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలి్సన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు కాసేపు సేదదీరేందుకు నీడలేక.. ఎండలోనే ఉంటూ అనారోగ్యం పాలవుతున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదు. జిల్లాలో 5.36 లక్షల మందికి జాబ్‌ కార్డులు మంజూరయ్యాయి. వీరిలో 2.50 లక్షల మంది ఈ పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం కింద పనులు చేసేందుకు వచ్చే కూలీలకు పనిచేసే ప్రదేశంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బకు గురి కాకుండా గుడారాలు ఏర్పాటు చేయాలి. తాగునీటిని సైతం అందుబాటులో ఉంచాలి. కూలీలు గాయపడినా.. సొమ్మసిల్లి పడిపోయినా ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన కిట్లను సైతం సమకూర్చాల్సి ఉంది. అయితే, అధికారులు వీటి ఏర్పాటును విస్మరించడంతో ఎండబారిన పడుతున్న కూలీలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇదిలావుంటే.. కూలీలు పనిలో ఉండగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
 
ప్రత్యేక నిధులు లేవు
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు నిధుల కేటాయింపులు లేవు. కూలీలు 75శాతం పనిచేస్తే వారి ఖాతాల్లో 100 శాతం పనులకు కూలీ చెల్లిస్తున్నాం. మరణించిన కూలీలకు రూ.50 వేలు పరిహారం ఇస్తాం.     – ఎం.వెంకటరమణ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌
 
మరిన్ని వార్తలు