రెండంకెల వృద్ధి రేటు లక్ష్యం

16 Aug, 2016 00:39 IST|Sakshi
రెండంకెల వృద్ధి రేటు లక్ష్యం

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో రెండు అంకెల వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా సోమవారం పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పెరేడ్‌ తిలకించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలకు ఆయన సందేశం ఇచ్చారు. ఈ ఏడాది 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో తలసరి ఆదాయాన్ని 94 వేల నుంచి లక్షా 10 వేల రూపాయలు సాధించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. ప్రాథమిక రంగంలో 5 శాతం, ద్వితీయ రంగంలో 17 శాతం, సేవా రంగంలో 14 శాతం, వృద్ధి రేటు సాధన దిశగా జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని తెలిపారు.  వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. ఈ ఏడాది 4126 కోట్ల రూపాయల లక్ష్యానికిగాను ఇప్పటికే 1325 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు పంపిణీ చేశామన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు పంపిణీ చేశామన్నారు. రాయితీపై వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నామని చెప్పారు. 50 వేల రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులు ఒకే దఫాలో రుణ విముక్తులయ్యారని చెప్పారు. 50 నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో దశల వారీగా రుణమాఫీ మొత్తాన్ని జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,52,000 మంది రైతులకు సుమారు రూ. 1286 కోట్లు రుణమాఫీ వర్తించిందన్నారు. ఇప్పటిదాకా రెండు విడతల్లో 668 కోట్ల 56 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు 1.1 శాతం ఉందని, దీన్ని 40 శాతానికి పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థూల ఉత్పత్తిలో గత సంవత్సరం ఉన్న 23 శాతం వాటాను ఈ ఏడాది నాలుగు శాతం వృద్ధి రేటుతో 27 శాతం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా స్థూల ఉత్పత్తిలో గత ఏడాది 12 శాతం వృద్ధి సా«ధించగా, ఈ యేడు 20 శాతం సాధించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ యేడు పండ్ల తోటల విస్తరణ, రక్షిత వ్యవసాయం, ఉద్యాన యాంత్రీకరణ పథకాలను రూ. 26 కోట్లతో అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యాన రైతులకు కూడా రుణమాఫీ చేశామన్నారు. జిల్లాలో 32 వేల మందికి 67 కోట్ల 35 లక్షల రూపాయలు మాఫీ చేశామని పేర్కొన్నారు. ఈ యేడు 40,400 హెక్టార్లలో బిందు, తుంపర సేద్య పరికరాల ఏర్పాటుకు రైతులకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 124 రెయిన్‌ గన్స్, 124 స్ప్రింకర్లు, 3100 అదనపు పైపులు సమకూర్చామన్నారు. ఈ యేడు 400 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యంగా నిర్దేశించామన్నారు.  అలాగే 4 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ యేడు కోటి మేలు జాతి చేప పిల్లల పెంపకం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 59 లక్షల చేప పిల్లలను చుతున్నామన్నారు. చేనేత కార్మికులు 986 మందికి రూ. 5 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. మైలవరం టెక్స్‌టైల్‌ పార్కుకు రూ. 4 కోట్లు విడుదల కాగా, రూ. 3 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రొద్దుటూరులో అపెరల్‌ పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు.    శ్రీశైలం జలాశయం ద్వారా గండికోట రిజర్వాయర్‌కు 12 టీఎంసీల నీటిని ఈ యేడు తీసుకొస్తామని చెప్పారు. గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుగంగ పథకం కింద గత ఏడాది 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఈ యేడు శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 12 టీఎంసీల నీటిని బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌కు మళ్లిస్తామన్నారు. బ్రహ్మంసాగర్‌ కింద లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేసీ కెనాల్‌ కింద 90 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, సగిలేరు ప్రాజెక్టుల ద్వారా సుమారు 56 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. భూగర్భ జలాలను పెంపొందించే పనులకు అ«ధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 40 వేల ఫారంపాండ్లు తవ్వించడం లక్ష్యం కాగా, 35 వేల పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. లక్ష ఇంకుడు గుంతలకుగాను 33 వేల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా 45 వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. వనం–మనం కింద 3,65,000 మొక్కలు నాటామన్నారు. జిల్లాలో 285 వ్యవసాయ బోరు బావులకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నామన్నారు. ఈ యేడు 21,510 కొత్త సర్వీసులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా సంఘాలకు రూ. 630 కోట్లు పంపిణీ లక్ష్యం కాగా, ఇప్పటికి రూ. 69 కోట్లు ఇచ్చామన్నారు. స్త్రీ నిధి రుణాల కింద ఈ యేడు రూ. 80 కోట్లకుగాను ఇప్పటికి రూ. 28 కోట్లు ఇచ్చామని వివరించారు. వంద శాతం గర్భవతుల నమోదు, ఈ–ఔషధి కార్యక్రమంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ, ఎన్‌ఐటీ, నీట్‌ పోటీ పరీక్షలకు ఫౌండేషన్‌ కోర్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ యేడు 3373 గృహాలను మంజూరు చేశామన్నారు. ఒంటిమిట్ట, గండికోట, కడప దర్గాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కడప సమీపంలో 12.56 ఎకరాల్లో హజ్‌హౌస్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.  ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి ఘనంగా సత్కరించారు.       పోలీసు, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్లు్యఎస్, అగ్నిమాపక,108, డ్వామా శాఖలు అభివృద్ధి శకటాలను ప్రదర్శించాయి. డీఆర్‌డీఏ, ఏపీ వికలాంగుల సహకార కార్పొరేషన్, మెప్మా, ఏపీఎంఐపీలు 9163 మంది లబ్ధిదారులకు రూ. 29,95,00,000 విలువజేసే 1432 యూనిట్లను మంజూరు చేశారు. వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకుగాను మొత్తం 265 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మంత్రి గంటా శ్రీనివాసరావు మెరిట్‌ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, అడిషనల్‌ ఎస్పీ విజయ్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ శ్వేత తెవతీయ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, అనధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు