జీవితాలతో ఆటలు!

23 Aug, 2016 22:35 IST|Sakshi
ఎంఈఓల మధ్య కొనసాగుతున్న ఉత్కంఠ
జాయిన్‌ కాని గొల్లప్రోలు ఎంఈఓ, పిఠాపురంలో ఇద్దరు ఎంఈఓలు
సందిగ్ధంలో ఆయా మండలాల్లోని ఉపాధ్యాయుల జీతాలు
పట్టించుకోని విద్యా శాఖ ఉన్నతాధికారులు
 
 
పిఠాపురం నియోజకవర్గంలో ఉపాధ్యాయుల పరిస్థితి అయోమయంగా మారింది. కాదంటే ఖబద్డార్‌ అంటూ నాయకులు హెచ్చరించడంతో మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. ఫలితంగా రెండు మండలాలకు చెందిన 280 మంది ఉపాధ్యాయుల జీతాలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
– పిఠాపురం
 
ఇప్పటికే గొల్లప్రోలు మండలంలో ఎంఈఓ లేక గత నెల జీతాలు పది రోజులు ఆలస్యం కాగా, విద్యాశాఖాధికారులు తాత్కాలిక చర్యలతో జీతాలు అందే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎంఈఓ నియామకానికి మాత్రం చర్యలు తీసుకోపోవడంతో.. సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో మళ్లీ జీతాల బిల్లులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్‌ ఉండగా.. ఇన్‌చార్జి
అసలు ఎంఈఓ లేక ఇక్కడ ఈ సమస్య ఎదురైతే పిఠాపురం మండలంలో మాత్రం ఇద్దరు ఎంఈఓలు ఉండడంతో అక్కడి ఉపాధ్యాయులకు కొత్త సమస్య వచ్చిపడింది. రెగ్యులర్‌ ఎంఈఓ సెలవుపై వెళ్లడం, తర్వాత ఆమె వచ్చి జాయిన్‌ అవ్వడానికి ప్రయత్నించడం, దానికి స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ ఆమెను జాయిన్‌ చేసుకున్న విద్యా శాఖ ఉన్నతాధికారులు మరొకరిని ఇన్‌చార్జి ఎంఈఓగా నియమించడం ఉపాధ్యాయులను కరవరపరుస్తోంది.
సంతకం ఎవరు చేస్తారు?
సాధారణంగా ప్రతి నెల 20లోపు ఉపాధ్యాయుల జీతాల బిల్లులపై ఎంఈఓ సంతకాలు చేసి పంపించాలి. కానీ ఇక్కడ ఇద్దరు ఎంఈఓలు పనిచేస్తుండడంతో ఎవరు జీతాల బిల్లులపై సంతకాలు చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతుండడంతో, 23వ తేదీ వచ్చినా జీతాల బిల్లులు సంతకాలు కాలేదు. దీంతో పిఠాపురం మండలంలో 150 మంది ఉపాధ్యాయుల జీతాలు ఆలస్యమయ్యే పరిస్థితి ఎదురైంది. రెగ్యులర్‌ ఎంఈఓను కాబట్టి తాను సంతకం చేయాలంటే ఇన్‌చార్జిను తొలగించాలని, అప్పటివరకు తాను సంతకం చేయనని రెగ్యులర్‌ ఎంఈఓ రమణమ్మ భీష్మించారు. అయితే ఇన్‌చార్జి ఎంఈఓకు పూర్తి బాధ్యతలు అప్పగించి, జీతాల బిల్లులు పూర్తి చేయిస్తామని విద్యాశాఖాధికారులు అంటున్నారు. రెగ్యులర్‌ ఎంఈఓ ఉండగా, ఇన్‌చార్జి ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం జవాబు చెప్పడానికి సాహసించడం లేదు. దీంతో గొల్లప్రోలు మండలంలో 122 మంది, పిఠాపురం మండలంలో 150 మంది ఉపాధ్యాయుల జీ(వి)తాలతో ఉన్నతాధికారులు ఆటలాడుకుంటున్నారని ఉపాధ్యాయ వర్గాలు విమర్శిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు