టెన్షన్‌.. టెన్షన్‌!

9 Aug, 2016 01:50 IST|Sakshi
  •  షాద్‌నగర్‌ పట్టణంలో రెడ్‌ అలర్టు
  •  నయీం మృతదేహనికి పోస్టుమార్టం 
  • షాద్‌నగర్‌ / షాద్‌నగర్‌ రూరల్‌: మాజీ మావోయిస్టు నేత, గ్యాంగ్‌స్టర్‌ నయీం(50) ఎన్‌కౌంటర్‌తో సోమవారం ఉదయం ఒక్కసారిగా షాద్‌నగర్‌ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏం జరుగుతుందో తెలియక పట్టణవాసులు అయోమయానికి గురయ్యారు. పోలీసు వాహనాలు రయ్‌.. మంటూ పరుగులు తీయడంతో ఏం జరిగిందోనని ఆసక్తిగా గమనించారు. పోలీసులు ఎక్కడికక్కడే వాహనాలను ఆపి దారిమళ్లించారు. పట్టణ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌లో నయీం ఎన్‌కౌంటర్‌కు గురికావడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ వార్త పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో అతడి మృతదేహాన్ని చూసేందుకు పట్టణవాసులు పెద్దఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసు బలగాలు భారీఎత్తున అక్కడికి చేరుకుని ప్రజలు, మీడియాను దూరంగా నిలిపివేశారు. మిలీనియం టౌన్‌షిప్‌ పాత జాతీయ రహదారికి సమీపంలోనే ఉండటంతో రోడ్డుపై భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. 
    ఉగ్రవాదులు హతమయ్యారంటూ..
    ఒకసారి నలుగురు, మరోసారి ఇద్దరు, మరోసారి ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారంటూ పట్టణంలో ప్రచారం జరిగింది. ఎన్‌కౌంటర్‌ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. పోలీసులు ముందే రెడ్‌ఎలర్ట్‌ ప్రకటించి వాహనాలను బైపాస్‌ రహదారిలో దారిమళ్లించారు. మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నారని పుకార్లు వ్యాపించడంతో పోలీసులు పట్టణం నలుమూలల తనిఖీలను విస్తృతం చేశారు. కారులు, జీపులు, ఇతర వాహనాలను ఆపి సోదాలు నిర్వహించారు. భారీ వాహనాలను సంఘటన స్థలం నుంచి రెండు కిలోమీటర్ల మేర నుంచే దారిమళ్లించారు. 
    తహసీల్దార్‌ చందర్‌రావు సమక్షంలో..
     షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోనే నయీం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందగా సాయంత్రం ఐదుగంటల వరకు సంఘటన స్థలంలోనే ఉంచారు. తహసీల్దార్‌ చందర్‌రావు సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించి షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రాత్రి తొమ్మిది గంటలకు భారీ పోలీసు బందోబస్తు నడుమ నయీం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అంతకుముందు ఆయన బంధువులకు సమాచారమిచ్చారు. వారెవరూ రాకపోవడంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మార్చురీలో భద్రపరిచారు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం వరకు బంధువులు తీసుకెళ్లే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ తీసుకెళ్లకుంటే ఏమి చేయాలనేది రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రందించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.
    ఈ కారు ఎవరిది?
    గ్యాంగ్‌స్టర్‌ నయీం ఉపయోగిస్తున్న కారు ఎవరిదనేది సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోర్డు ఎండివర్‌ కారు (నం. ఏపీ28 డీఆర్‌ 5859) ను 2013లో వడ్డేపల్లి నర్సింగ్‌రావు పేరిట రిజిష్టర్‌ అయినట్టుగా ఆర్టీఏ రికార్డు ప్రకారం తెలుస్తోంది. భూదందా, కబ్జాలు చేసిన నయీం వినియోగించిన కారు ఆయన పేరిట లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిని ఎవరైనా బహుమతిగా ఇచ్చారాననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజులుగా అతను ఇదే వాహనంలో షాద్‌నగర్‌కు రాకపోకలు సాగిస్తున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. అందులో రివాల్వర్‌ బుట్ట దొరికింది. అనంతరం క్రేన్‌సాయంతో కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
      ఆచూకీ చెప్పిన ఫోన్‌ సిగ్నల్‌
     నయీం కదలికలపై పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. నిజామాబాద్‌ జిల్లాలోని డిచ్‌పల్లికి చెందిన ఓ వ్యాపారికి న యీం ఫోన్‌ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు నయీం కదిలికలపై నిఘాను ముమ్మరం చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాడో పోలీసులు నిఘా ఏర్పాటు చేసుకున్నారు. షాద్‌నగర్‌ పట్టణ శివారులోని మిలీనియం టౌన్‌షిప్‌ నుంచి ఫోన్‌ సిగ్నల్‌ రావడాన్ని పసిగట్టిన వారు రెండు రోజులుగా ఈ ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేశారు. సోమవారం ఉదయం నయీం తన డ్రైవర్‌తో కలిసి మిలీనియం టౌన్‌షిప్‌లో నుంచి ఫోర్ట్‌ ఎండివర్‌ వాహనంలో వెళుతుండగా ప్రత్యేక పోలీసులు వాహనాన్ని ఆపడానికి యత్నించారు. దీంతో డ్రైవర్‌ భయంతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపారు. డ్రైవర్‌ పారిపోగా నయీం అక్కడికక్కడే మృతి చెందాడు. నయీం సెటిల్‌మెంట్, భూదందాలకు సంబంధించి లక్ష్యంగా చేసుకున్న వారికి షాద్‌నగర్‌ ప్రాంతం నుంచే ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతుండేవాడు. సాధారణంగా బెదిరింపులపైనే దృష్టి సారించిన పోలీసులు ఏ ప్రాతంలో ఉంటున్నాడనే దానిపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. చివరకు డిచ్‌పల్లికి చెందిన రియల్టర్‌ పోలీసులపై ఒత్తిడి తేవడంతో సెల్‌ టవర్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అదే నయీం ఎన్‌కౌంటర్‌కు కీలక ఆధార మైంది. షాద్‌నగర్‌లో ఇంత స్థాయిలో ఆశ్రయం ఏర్పరుచుకోవడానికి, గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు చేయడానికి సహకరిస్తున్న స్థానికులెవరో పోలీసులు ఆరా తీస్తున్నారు. 
    బిక్కుబిక్కుమన్న కాలనీవాసులు 
    ఏమి జరుగుతుందో తెలియక కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ మధ్యాహ్నం వరకు ఇళ్లలోనే గడిపారు. సోమవారం ఉదయం కాలనీకి చేరుకున్న ప్రత్యేక పోలీసులు కాలనీవాళ్లను బయటకు రావద్దంటూ హెచ్చరికలు చేశారు. అనంతరం చుట్టుపక్కల ఇళ్లకు బయట నుంచి గడియ పెట్టారు. 
మరిన్ని వార్తలు