ప్రారంభమైన రహదారి విస్తరణ పనులు

2 Aug, 2016 00:06 IST|Sakshi
మధిరలో పనులు జరుగుతున్న దశ్యం



మధిర : మధిర పట్టణంలో నిలిచిపోయిన నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. రూ.13కోట్లతో మధిర వ్యవసాయ మార్కెట్‌ యార్డు నుంచి ఆత్కూరు క్రాస్‌రోడ్డు వరకు నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులను గత రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే ఇటీవల పలు కారణాలతో పనులు నిలిచిపోగా.. ఈ సమస్యపై జూలై 30న ‘సాక్షి’ దినపత్రికలో ‘నాలుగులైన్లు–రెండేళ్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నుంచి నిలిచిపోయిన విస్తరణ పనులను కొనసాగిస్తున్నారు. ఆక్రమణలో ఉన్న ఇంటి గోడలను యజమానులే స్వచ్ఛందంగా తొలగించగా మరికొన్ని ఇళ్లవద్ద ఆక్రమణలను తొలగించలేదు. పొక్లెయినర్‌తో వాటిని తొలగిస్తున్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ డీఈ పవార్‌ను వివరణ కోరగా.. మధిరలో అసంపూర్తిగా నిలిచిన పనులను పునఃప్రారంభించినట్లు తెలిపారు. ఈ సమస్యపై నగరపంచాయతీ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో మాట్లాడామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆక్రమణల తొలగింపు పనులు పూర్తయ్యాక సైడ్‌డ్రైన్ల నిర్మాణం, డివైడర్ల ఏర్పాటు తదితర పనులను పూర్తిచేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు