అస్తవ్యస్తం

10 Aug, 2017 00:33 IST|Sakshi
అస్తవ్యస్తం

గందరగోళంగా రెవెన్యూ రికార్డులు
మూటల్లో మూలుగుతున్న సేత్వార్‌లు
దస్త్రాల ప్రక్షాళనకు మోక్షమెప్పుడో?
30శాతం భూముల రికార్డులు మాయం
26 మండలాలకు 12 మంది సర్వేయర్లు
రికార్డులు లేకుండా ‘రెవెన్యూ ఎర్రర్‌ ఫ్రీ’!


రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించి భూ దస్త్రాలను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సర్వే సెటిల్‌మెంట్‌ తర్వాత భూముల క్రయ విక్రయాలు పారదర్శకంగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత పట్టాదారు పాసుపుస్తకాలు, పహాణీ పత్రాలు మరింత సరళంగా ఉండేలా చూడాలని యోచిస్తోంది. జిల్లాలో ఇప్పటికే ‘రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలు’ అంటూ రెవెన్యూ రికార్డులను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. రెవెన్యూ రికార్డులకు ‘బైబిల్‌’గా చెప్పుకునే సేత్వార్, ఖాస్రా రికార్డులు నిర్వహణ లోపంతో మూటలకు పరిమితమయ్యాయి.

సాక్షి, సంగారెడ్డి : నిజాం పాలనా కాలం 1932లో సర్వే సెటిల్‌మెంట్‌ అనంతరం సర్వే నంబరు, విస్తీర్ణం, యజమాని, భూమి, పంట రకం, కొలతలు, హద్దులు తదితర వివరాలతో కూడిన టిప్పన్‌ల సమాహారంగా ‘సేత్వార్‌’ను రూపొందించారు. ఆ తర్వాత తిరిగి 1954–55 మధ్య కాలంలో భూ యజమాన్య హక్కులకు సంబంధించి శాశ్వత రికార్డుగా పేర్కొం టూ ‘ఖాస్రా పహాణీ’ రూపొందించారు.

సేత్వార్, ఖాస్రా పహాణీల నిర్వహణలో నిర్లక్ష్యంతోప్రస్తుతం 30శాతం భూముల వివరాలకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలు, లెక్కలు లేకుండా పోయాయి. సేత్వార్‌లను కంప్యూటరీకరించేందుకు 2005–2007లో చేసిన ప్రయోగం.. విఫలమై రికార్డులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.

జిల్లాలో శ్రేయ, రాశి అనే ప్రైవేటు ఏజెన్సీలకు సేత్వార్‌లను జిరాక్సు తీసే బాధ్యత అప్పగించగా.. సిబ్బంది నిర్లక్ష్యంతో దశాబ్దాల చరిత్ర కలగిన సేత్వార్‌ కాపీలు చిరిగి పొడిలా తయారయ్యాయి.దీంతో కాగితాలను మూటల్లో కట్టి సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యాలయంలో నేలపైనే పెట్టారు. సుమారు 30శాతం భూములకు సంబంధించి సేత్వార్‌ రికార్డులు లేకపోవడాన్ని అక్రమార్కులు ఆసరాగా తీసుకుంటున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సేత్వార్‌ కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకున్నా తమ వద్ద సేత్వార్‌ లభ్యం కాలేదంటూ సర్వే ల్యాండ్‌ రికార్డు కార్యాలయం సమాధానం ఇస్తోంది.

పీడిస్తున్న సర్వేయర్ల కొరత
ప్రస్తుతం జిల్లాలో 26 మండలాలకు 12 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఐదు చోట్ల ఐదుగురు లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు అవసరాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తున్నారు. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. భూముల సర్వే కోసం యజమానులు దరఖాస్తు చేసుకున్నా సర్వేయర్ల కొరత కారణంగా నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.

దీంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి లైసెన్స్‌డ్‌ లేదా ప్రైవేటు సర్వేయర్లతో కొలతలు వేయించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు సర్వేయర్లు లేక భూ వివాదాలు ఏళ్ల తరబడి కొలిక్కి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే సెటిల్‌మెంట్‌ నిర్వహించి భూ దస్త్రాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల విభాగాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దస్త్రాల ప్రక్షాళనకు సంబంధించి మార్గదర్శకాలు అందాల్సి ఉందని రెవెన్యూ ఉన్నతాధికారులు వెల్లడించారు.

తప్పుల తడకగా రికార్డులు
జిల్లాలో రెవెన్యూ సమస్యలు లేని గ్రామాల పేరిట రెవెన్యూ యంత్రాంగం రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దుతోంది. ఇప్పటికే వంద గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రకటించారు. మరో రెండు వందల గ్రామాలను త్వరలో ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారు. రైతుల వద్ద ఉండే పట్టాదారు పాసుపుస్తకాలు, ప్రభుత్వం వద్ద ఉండే రెవెన్యూ రికార్డుల్లో వివరాలు ఒకే రకంగా ఉండేలా చూడటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.

ఏళ్ల తరబడి భూ రికార్డుల ప్రక్షాళన శాస్త్రీయంగా జరగకపోవడంతో భూ సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయి. గ్రామ కంఠాల ఆక్రమణ, చెరువులు, కుంటల హద్దులు చెరిపివేయడం, ప్రభుత్వ, అటవీ భూముల ఆక్రమణ, అసైన్డ్‌ భూముల అక్రమాలు, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు.. ఇలా సవాలక్ష కారణాలతో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో క్షేత్ర స్థాయిలో భూ యజమానుల వద్ద ఉన్న రికార్డులకు, ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలకు పొంతన లేకుండా పోయింది. మరోవైపు భూ కొలతలకు సంబంధించి డీ అండ్‌ ఓ, మరాఠ్వాడ విధానాలను అనుసరించడంతో రెవెన్యూ రికార్డులు మరింత సంక్లిష్టంగా తయారయ్యాయి.



భూముల విస్తీర్ణం (హెక్టార్లలో)
అటవీ భూమి                                                  23,358
సాగులో  ఉన్నది                                           2,34,575
దీర్ఘకాలంగా  పడావుగా  ఉన్న భూమి                     30,416
బీడు, వ్యవసాయ యోగ్యం కానిది                          19,512
పచ్చిక బయళ్లు                                               11,860
వివిధ రకాల వృక్షాలతో కూడినవి                             1,490
సాగు యోగ్యమే కానీ నిరుపయోగం                          7,340
ఏడాదిగా పడావుగా ఉన్న భూమి                          67,847.

మరిన్ని వార్తలు