దేవాలయాల్లో దొంగల బీభత్సం

26 Jul, 2016 23:26 IST|Sakshi
దేవాలయాల్లో దొంగల బీభత్సం
= మూడు దేవాలయాల్లో హుండీల సొత్తు చోరీ
= తలుపులు ధ్వంసం చేసిన వైనం
తాళ్లూరు : దేవాలయాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు దేవాలయాల్లో తలుపులు ధ్వంసం చేసి హుండీలను పగులకొట్టి నగదు చోరీ చేశారు. తాళ్లూరు మండలంలోని రెండు దేవాలయాలు, దర్శి మండలం త్రిపురసుందరీపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న మరో దేవాలయంలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాల ప్రకారం... తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామం చెరువు సమీపంలో ఉన్న శ్రీ పర్వతవర్థిని సోమేశ్వరస్వామి దేవాలయం, జ్వాలాముఖి అమ్మవారి ఆలయాల తలుపులకు వేసి ఉన్న తాళాలు పగులకొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. అనంతరం హుండీలను ధ్వంసం చేసి వాటిలోని నగదును అపరహరించారు. సోమేశ్వరస్వామి దేవాలయంలో అమ్మవారి ముక్కుపుడుక, తాళిబొట్టు, పూజారికి చెందిన బ్యాగ్‌లోని రూ.20 వేల నగదు మాయమైనట్లు తేలింది. ఇతర కాగితాలు, రసీదులన్నీ ఆలయం వెనుకవైపు వేసి ఉండటంతో పూజారి సేకరించారు. అదే విధంగా పక్కనే ఉన్న జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో ని బీరువాను బద్దలుకొట్టి గాలించారు. ఈ రెండు దేవాలయాలతో పాటు దర్శి మండ లం త్రిపురసుందరీపురం ఆంజనేయస్వామి దేవాలయంలోనూ హుండీ, బీరువాను పగులకొట్టి నగదు అపహరించారు. వరుస చోరీలతో బొద్దికూరపాడు, చింతలపాలెం, త్రిపురసుందరీపురం ప్రజలు ఉలిక్కిపడ్డారు. చోరీ చేసింది తాగుబోతులా, ఆకతాయిలా.. లేకుంటే దొంగల ముఠానా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
నగదుపై మాత్రమే దృష్టి...
శివాలయంలో విలువైన వెండికిరీటం, ఉత్సవ విగ్రహాలు ఉన్నప్పటికీ వాటిని తాకకుండా కేవలం డబ్బుపై మాత్రమే దొంగలు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే హుండీ లు పగులకొట్టినట్లు స్పష్టమవుతోంది. విలువైన వస్తువులు ఉన్నప్పటికీ శివాలయానికి రాత్రివేళ వాచ్‌మెన్‌ను పెట్టకపోవడంపై దేవాదాయశాఖ నిర్లక్షా్యన్ని ప్రజలు విమర్శిస్తున్నా రు. కాగా, సమాచారం అందుకున్న తాళ్లూరు, దర్శి ఎస్సైలు మహేష్‌బాబు, సుబ్బారావులు సంఘటన స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్‌టీం సీఐ జెడ్‌.రాజు ఆలయాల్లో ఆధారాలు సేకరించారు.  
మరిన్ని వార్తలు