మూడు టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలు

3 Sep, 2016 00:08 IST|Sakshi
మూడు టౌన్‌ ప్లానింగ్‌ కార్యాలయాలు
  • భూపాలపల్లి, మానుకోట, హన్మకొండ జిల్లాల్లో ఏర్పాటు
  • 12 జిల్లాలకు ఒక్కటే  టీసీపీ ఆర్‌డీ ఆఫీస్‌!
  •  
    వరంగల్‌ అర్బన్‌ :  జిల్లాల పునర్విభజన నేపథ్యంలో టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ శాఖలో విభజన కసరత్తు సాగుతోంది. వరంగల్‌ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ నాలుగు జిల్లాలుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ అధికారులు, సర్వేయర్లు, కంప్యూటర్‌ ఔట్‌సోర్సింగ్‌ ఆపరేటర్ల నియామకాలపై రాష్ట్ర టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌బాబు వివరాలను సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
    గ్రామీణ ప్రాంతాల్లో జీప్లస్‌ 2 భవనాల వరకు ఆయా పంచాయతీల కార్యదర్శులు అనుమతులు మంజూరు చేస్తారు. జీ ప్లస్‌2 ఆపై అంతస్తులకు, పరిశ్రమలకు జిల్లా టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి (డీటీసీపీఓ) నిర్మాణ అనుమతులు జారీ చేస్తారు. దీంతో డీటీసీపీవో పోస్టులు కీలకం కానున్నాయి.
    డీటీసీపీవోల విభజన ఇలా...
    ప్రభుత్వం నాలుగు జిల్లాలుగా విభజించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో వరంగల్‌ జిల్లాకు ప్రస్తుతం ఉన్న డీటీసీపీవో ఎ.కోదండరామిరెడ్డి కొనసాగనున్నట్లు సమాచారం. ఇక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్‌ డీటీసీపీవోకు పదోన్నతి కల్పించి హన్మకొండ జిల్లా డీటీసీపీవోగా బాధ్యతలు కట్టబెట్టనున్నట్లు తెలిసింది. ఇక మహబూబాబాద్, జయశంకర్‌(భూపాలపల్లి) జిల్లాలకు ఇద్దరు డీటీసీపీవోలు నియమించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వీరిద్దరికే రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. వరంగల్‌ డీటీసీపీవో కార్యాలయంలో ఇద్దరు అసిస్టెంట్‌ డీటీసీపీవోలు కావాల్సి ఉంది. ఇద్దరు సర్వేయర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వరంగల్‌ జిల్లాకు ఇద్దరు ఏడీటీసీపీవోలతోపాటు మరో సర్వేయర్‌ను నియమించాల్సి ఉంది. ఆరుగురు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఆపరేటర్ల నియామకానికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్‌ జిల్లాలకు ఇద్దరి చొప్పన ఏడీటీసీపీవోలు, ఇద్దరు సర్వేయర్లను నియమించాల్సి ఉంది. అంతేకాకుండా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో జిల్లాకు ఆరుగురి చొప్పున విధుల్లోకి తీసుకోవాల్సి ఉందని ప్రతిపాదనల్లో పొందుపరిచారు.
    ఒకే టీసీపీ ఆర్‌డీ ఆఫీస్‌
    వరంగల్‌ రీజినల్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ రీజినల్‌ డైరెక్టర్‌(ఆర్‌డీ) పరిధిలో ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లోని మునిసిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో టౌన్‌ప్లానింగ్‌ కార్యకలాపాలను ఆర్‌డీ పర్యవేక్షిస్తారు. తాజాగా జిల్లాల పునర్విభజనతో నాలుగు జిల్లాలు కాస్త 12కు చేరాయి. ఖమ్మం, కొత్తగూడెం, మానుకోట, జయశంకర్‌ (భూపలపల్లి), వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, కొమురంభీం జిల్లా, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలుగా విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఒక ఆర్‌డీ కార్యాలయం ఏర్పాటు చేయాలనే భావనలో రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం మరో ఆర్‌డీ కార్యాలయం ఏర్పాటుపై స్తబ్దత నెలకొన్నట్లు టౌన్‌ ప్లానింగ్‌లు అధికారులు చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు