రాష్ట్రంలో పులులు.. ఢిల్లీలో పిల్లులు

10 Aug, 2013 02:08 IST|Sakshi
రాష్ట్రంలో పులులు.. ఢిల్లీలో పిల్లులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు నోరు మెదపలేదు. సోనియాగాంధీ నిర్వహించిన సమావేశాల్లో పెదవి విప్పలేదు. విభజన నిర్ణ యం ప్రకటించిన తొమ్మిది రోజుల తర్వాత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవేశంతో ఊగిపోతున్నారు. దీని వెనుక ఆంతర్యమేమిటో ప్రజలందరికీ తెలుసు’ అని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ  కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ పులులుగా తిరిగే కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో పిల్లులుగా ఉంటారని ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్ర విభజన అంశంలో ముఖ్యమంత్రి గందరగోళంలో పడి ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో ఉన్నారన్నారు. అందుకే దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ హయాంలో తెలంగాణ, సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన నాయకులే లేరని గుర్తు చేశారు. వైఎస్ మరణం తర్వాతే రాష్ర్ట విభజన కోసం ఉద్యమాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ అధిష్టానం చెప్పే మాటలు వినడం తప్ప ఎదురు చెప్పలేని రాష్ట్ర ఎంపీలు, మంత్రులు ఇక్కడ ఉద్యమాలు చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు. 
 
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఉంటే, ఆ పార్టీ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గంటా శ్రీనివాసరావు రాజకీయ లబ్ధి కోసమే నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేశారని విమర్శించారు. గంటాకు చిత్తశుద్ధి ఉంటే తన రాజీనామాను ఆమోదించుకుని జిల్లాలోని అన్ని పార్టీలు, ఇతర సంఘాలను కలుపుకుని ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించగానే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చెప్పారు. ఉద్యమాల పేరుతో రాజకీయం చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏయూ జేఏసీ ఈ నెల 14న నిర్వహించే సింహగర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్  సీపీ ఉద్యమాలు చేస్తుండడంతో గంటా తన బృందంతో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేశారని విమర్శించారు. అన్ని పార్టీల నాయకులు, సంఘాలను ఆహ్వానించకుండా సొంత వ్యక్తులతో జేఏసీ ఏర్పాటు చేయడం తన రాజకీయ భవిష్యత్ కోసమేనని ధ్వజమెత్తారు. నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణగదొక్కడానికి ఉక్కుపాదం మోపుతున్నారని ఆరోపించారు. పోలీస్ కమిషనర్ తెలంగాణ అధికారి కావడం వల్ల పోలీస్ బలగాలతో ఉద్యమాన్ని అణిచివేస్తున్నారన్నారు. ఉన్నతాధికారిగా సమైక్యావాదుల ఆందోళన అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఉత్తర, గాజువాక నియోజక వర్గ సమన్వయకర్తలు జి.వి.రవిరాజు, తిప్పల నాగిరెడ్డి, బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, లీగల్‌సెల్ కన్వీనర్ కాళీదాసురెడ్డి పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు