కౌలు రైతులకు ప్రత్యేక పథకాలు రూపొందించాలి

13 Feb, 2017 02:07 IST|Sakshi

ఒంగోలు టౌన్‌:  కౌలు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఆచార్య రావూరి వీరరాఘవయ్య సూచించారు. సామాజిక పరిణామ పరిశోధన సంస్థ(రైజ్‌) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మల్లయ్య లింగం భవనంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఎన్ని పథకాలు తెచ్చినా అవి వారికి ఉపయోగపడటం లేదన్నారు. రైజ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌. ప్రసాదరావు మాట్లాడుతూ ఫ్రామ్‌ పేరుతో డీఎంఆర్‌ శేఖర్‌ కనిపెట్టిన ఎరువు డీఏపీ కంటే చౌకగా ఉంటుందన్నారు. దీనిని రైతులకు చేరవేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని సూచించారు. రైతు నాయకుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ  కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం పాలకులు పనిచేస్తున్నారని విమర్శించారు. ఇఫ్‌కో సంస్థకు వ్యవసాయ భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో భూసేకరణ ద్వారా ప్రభుత్వం పేద నిర్వాసితుల పొట్టను కొడుతుందని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.హనుమారెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

వ్యవసాయ కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి కె.ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ద్రోహపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం గౌరవాధ్యక్షుడు షంషీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాలుగా ఉండాల్సిన ప్రభుత్వాలు భక్షకులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. సదస్సులో రైజ్‌ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు, సభ్యులు యూఆర్‌ ఆనంద్‌ పాల్గొన్నారు. ఆచార్య రావూరి వీరరాఘవయ్యకు డీటీ మోజస్‌ అవార్డుతోపాటు రూ.25వేల నగదును ఇందిరా శేఖర్‌ ట్రస్ట్‌ తరఫున డీఎంఆర్‌ శేఖర్, ఇందిరాశేఖర్‌ సంయుక్తంగా అందజేశారు.  

మరిన్ని వార్తలు