సీఎంగారు నడవలేరని.. పాఠశాల గోడను కూలగొట్టేశారు

13 Apr, 2016 01:48 IST|Sakshi
సీఎంగారు నడవలేరని.. పాఠశాల గోడను కూలగొట్టేశారు

చింతూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు చింతూరు పర్యటన నేపథ్యంలో ఉపాధిహామీ అధికారులు టీచర్ల అవతారమెత్తారు. ఉపాధిహామీలో భాగంగా నిర్మించిన ఊటకుంటను సందర్శించిన అనంతరం సీఎం ఉపాధి కూలీలతో ఇష్టాగోష్టి నిర్వహించునున్న నేపథ్యంలో ఆయనతో ఎలా మాట్లాడాలనే దానిపై అధికారులు మంగళవారం కూలీలకు పాఠాలు నేర్పారు. ‘వేసవిలో ప్రభుత్వం ద్వారా రూ.ఏడుకు కూలీలకు ఇస్తున్న మజ్జిగ అందుతుందా, లేదా అని సీఎం అడిగితే ఇస్తున్నారని చెప్పాలి. కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలోఫస్ట్‌ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంటుందా అని సీఎం అడిగితే, ఉంటుందని చెప్పాలి.

వేతనాలు సక్రమంగా ఇస్తున్నారా, పనికి తగ్గ వేతనం అందుతుందా అని అడిగితే, అవునని చెప్పాలి’ అంటూ కూలీలకు గంటపాటు శిక్షణ ఇచ్చారు. ఆయా విషయాలు ఏమాత్రం తడబడకుండా సీఎంకు చెప్పాలని, లేకుంటే అధికారులకు చెడ్డపేరు వస్తుందంటూ కూలీలను ప్రాథేయపడడం కనిపించింది.
 
సీఎంగారు నడవలేరని..
ముఖ్యమంత్రి ఎక్కువ దూరం నడవాల్సి వస్తుందని గురుకుల పాఠశాల గోడనే కూలగొట్టేశారు అధికారులు. ఐటీడీఏ భవనం, ట్రెజరీ కార్యాలయం ప్రారంభోత్సవాల అనంతరం సీఎం పక్కనున్న సభా ప్రాంగణానికి చేరుకోవాలి. కాగా ఈ కార్యాలయాల నుంచి బయలుదేరిన సీఎం పాఠశాల మెయిన్ గేటు మీదుగా సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉన్నా, ఆయనను అంతదూరం నడపడం బాగుండదేమో అని అధికారులు అనుకున్నట్టున్నారు. దీంతో ట్రెజరీ కార్యాలయం ఎదురుగా రహదారి పక్కనే ఉన్న పాఠశాల ప్రహరీని పొక్లెయిన్‌తో కూల్చివేసి, నేరుగా సభాస్థలికి దారి ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు