ఇక విజయవాడలోనే రవాణా కమిషనరేట్

9 Jun, 2016 19:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రవాణా శాఖ కమిషనరేట్ ఉద్యోగుల కార్యకలాపాలు ఈ నెల 27 నుంచి విజయవాడలో మొదలవుతాయని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. గురువారం ఉదయం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న భవనంలో రవాణా శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27కల్లా 80 మంది అధికారులు, ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, రెండో దశలో జూలై 15నాటికి సుమారు 70 మంది అధికారులు, ఉద్యోగులు వస్తారని వివరించారు.

సీఎం ఆదేశాలకు అనుగుణంగా తమ శాఖ కార్యాలయాన్ని ఇక్కడి మార్చామని చెప్పారు. ప్రభుత్వ ఆదాయంలో కీలక భూమిక పోషించే తమ శాఖ కార్యకలాపాలు విజయవాడ నుంచి ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర కార్యాలయ రికార్డులు, ఫర్నిచర్, ఇతర సామగ్రి 27వ తేదీనాటికి ఇక్కడికి వస్తామని చెప్పారు. 13 జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారులు, ఇతర విభాగాల అధికారులకు ఇక్కడ్నుంచే ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహిస్తామని చెప్పారు. రవాణా శాఖ నాన్ టెక్నికల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలాంటి షరతులు, డిమాండ్లు లేకుండా వచ్చి తాము పనిచేయడానికి సుముఖత తెలిపామని చెప్పారు.

మరిన్ని వార్తలు