సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కష్టాలు...

28 Sep, 2016 22:42 IST|Sakshi
సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కష్టాలు...
  • భారమవుతున్న ‘వర్సిటీ’ చదువులు
  • కంప్యూటర్‌ సైన్స్, ఫుడ్‌సైన్స్‌ కోర్సుల విద్యార్థుల ఇక్కట్లు
  • ఫలించని ‘రెగ్యులర్‌’ డిమాండ్‌
  • కమాన్‌చౌరస్తా : శాతవాహన యూనివర్సిటీలో ఏళ్ల తరబడి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా కొనసాగుతున్న ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నేటివరకు రెగ్యులర్‌ కోర్సులుగా మారలేదు. దీంతో ఆయా కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు ఆర్థికభారం తప్పడంలేదు. సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. పలుమార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. 
     
    ఫీజు భారమే....
    కంప్యూటర్‌ సైన్స్‌కోర్సుకు ప్రస్తుతం రూ.25,010, ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ కోర్సుకు రూ.36,865 ఉంది. మిగతా రెగ్యులర్‌ సైన్స్‌కోర్సులకు రూ.3,160 ఉంది. కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు 15ఏళ్ల నుంచి, ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ నాలుగేళ్లనుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా కొనసాగుతున్నాయి. వీటిని రెగ్యులర్‌ కోర్సులుగా మార్చితే విద్యార్థులకు ఫీజులభారం తగ్గనుంది. పరిశోధన, సదస్సులు, ప్రాజెక్టుల విషయంలో ముందుకు సాగే అవకాశాలుంటాయి. సదరు కోర్సులకు పరీక్ష ఫీజులు ఎక్కువగానే ఉంటున్నాయని, వసతి గహాల్లో ఉండడానికి సైతం ప్రాధాన్యత తక్కువగానే ఉంటుందని విద్యార్థులు అంటున్నారు.
     
    పెరుగుతున్న సీట్ల సంఖ్య
    ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఫుడ్‌ సైన్స్‌ టెక్నాలజీ  30 సీట్ల చొప్పున ఉండేవి. ప్రస్తుతం వాటిని 40కి పెంచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేరొందిన కంపెనీలు, మల్టీనేషనల్‌ కంపెనీలు తెలంగాణ ప్రాంతాలకు తరలిరావడంతో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. దీంతో కంప్యూటర్‌ విద్యపై ఆసక్తి చూపుతున్న తరుణంలో అధిక ఫీజులుండడంతో  విద్యార్థుల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయని విమర్శలున్నాయి. ఫుడ్‌సైన్స్‌ కోర్సు చేసిన వారు ఫుడ్‌సెఫ్టీ శాఖలో ఉద్యోగాలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రై వేట్‌ ఆహార రంగసంస్థలలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఫీజుల భారంతో లక్ష్యాలను చేరుకోలేమని, తక్షణమే వీటి నుంచి విముక్తి చేయాలని  విద్యార్థులు కోరుతున్నారు. 
     
    ఫలించని విన్నపాలు
    సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులుగా ఉన్న కంప్యూటర్‌ సైన్స్, ఫుడ్‌సైన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా పరిస్థితి మారలేదు. ఈ కోర్సులను రెగ్యులర్‌ చేయాలని గతంలో వీసీ వీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2015 డిసెంబర్‌ 11న రెండు కోర్సుల విద్యార్థులు ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వినతిపత్రంఇచ్చారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ జూలై 29న యూనివర్సిటీని సందర్శించినప్పుడు విద్యార్థులు సమస్యను విన్నవించారు. ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య గతంలో విశ్వవిద్యాలయానికి వచ్చిన సమయంలో వర్సిటీ అధికారులు రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని కోరినట్లు తెలిసింది. 
     
    ఉన్నత విద్యామండలికి చేరిన విషయం ?
    కంప్యూటర్‌సైన్స్, ఫుడ్‌సైన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని యూనివర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖకు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ ఉన్నత విద్యాశాఖ నుంచి ఉన్నత విద్యామండలికి చేరినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖలు ఈ విషయంపై దష్టి సారించి ఈ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చితే విద్యార్థుల బాధలు దూరమవుతాయని కోరుతున్నారు.  
     
    రెగ్యులర్‌ కోర్సుగా మార్చాలి
    –ఆనంద్‌రావు, విద్యార్థి
    శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌కోర్సు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుగానే కొనసాగుతూనే ఉంది. దీంతో ఆర్థిక భారమవుతోంది. ఈ విద్యా సంవత్సరం ముగియక ముందే స్పందించి రెగ్యులర్‌ కోర్సుగా మార్చితే విద్యార్థులకు లాభం చేకూరుతుంది. 
     
    ఇబ్బందులకు గురవుతున్నాం
    –నవీన్, విద్యార్థి
    వర్సిటీలో ఫుడ్‌సైన్స్, టెక్నాలజీ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా సెల్ప్‌ఫైనాన్స్‌ కోర్సులాగే ఉంది. ఆహార రంగంలో ప్రస్తుతం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దీనిని ఎంచుకుంటే ఫీజులు భారం భరించలేకపోతున్నాం. ప్రభుత్వం స్పందించి కోర్సును రెగ్యులర్‌ కోర్సుగా మార్చాలి.
     
     
     
మరిన్ని వార్తలు