పచ్చదనానికి పది కోట్లు

14 Apr, 2016 03:37 IST|Sakshi
పచ్చదనానికి పది కోట్లు

మున్సిపల్ కార్పొరేషన్లకు సీఎం నజరానా
పెద్దఎత్తున మొక్కలు పెంచాలని కార్పొరేటర్లకు సూచన
మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని ఉద్బోధ
ముగిసిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల శిక్షణ కార్యక్రమం

 చేవెళ్ల: మొక్కలు పెంచి పచ్చదనానికి కృషి చేసే మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.10 కోట్ల నజరానా అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పచ్చదనానికి పెద్దపీట వేసే డివిజన్‌కు రూ.కోటి అందజేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్‌లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల మూడ్రోజుల శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కార్పొరేటర్లను ఉద్దేశించి రెండు గంటలపాటు సుదీర్ఘంగా మాట్లాడారు.

పచ్చదనం పెంచేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో గుణాత్మక మార్పు తెచ్చే దిశగా కృషిచేయాలని సూచించారు. పట్టణాలను, నగరాలను అభివృద్ధి పరిచేందుకు ప్రతి ప్రజాప్రతినిధి బంగారు కల కనాలన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లను శాస్త్రీయంగా అభివృద్ధి చేయాలన్నారు. ‘‘పెరుగుతున్న జనాభాతో పట్టణాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి.

మౌళిక రంగాల్లో అభివృద్ధి సాధించకుంటే పట్టణాలు చెత్తకుప్పలా మారతాయి. జనాభాకు అనుగుణంగా కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, పారిశుధ్యం, పబ్లిక్ టాయిలెట్స్, రోడ్లు, ట్రాఫిక్ తదితర రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధించాలి’’ అని ఉద్బోధించారు. కార్పొరేషన్లకు గతంలో ప్రకటించిన రూ.100 కోట్లే కాదని, అవసరమైతే మరిన్ని నిధులిస్తామని చెప్పారు. పార్కులు, మొక్కల పెంపకం, శ్మశాన వాటికల నిర్మాణాలు జనాభాకు సరిపోయే విధంగా చేపట్టాలని పేర్కొన్నారు.

 ఇతర రాష్ట్రాల్లో పర్యటించండి
ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో పర్యటించి అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సీఎం కార్పొరేటర్లకు సూచిం చారు. మహారాష్ట్రలోని మల్కాపూర్ మున్సిపాలిటీ సహా నాగ్‌పూర్, ఢిల్లీలోని అభివృద్ధి చెందిన పట్టణాలను సందర్శించి రావాలన్నారు. హైదరాబాద్‌ను మూలాల నుంచి అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు, పి.మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని  ఎంపీలు కవిత, బాల్క సుమన్, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు