'టీడీపీ పాలన త్వరలోనే అంతమవుతుంది'

30 Jun, 2016 22:57 IST|Sakshi
'టీడీపీ పాలన త్వరలోనే అంతమవుతుంది'

అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన

జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీకి చెందిన పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన చెప్పారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో గురువారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను గృహంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కనీసం ప్రతిపక్షాలు.. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.

గతంలో విదేశీయులను దేశం నుంచి తరిమికొట్టాలని ఉద్యమాలు చేస్తే.. ప్రస్తుతం చంద్రబాబు వారితో బేరసారాలు చేస్తూ స్వదేశీ నిపుణులు, కంపెనీలను అవమానపరుస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు గ్యాస్ పైపులైన్లే వేయకపోయినప్పటికీ వైజాగ్‌లో చైనా కంపెనీతో గ్యాస్ ఆధారిత ఎరువుల ఫ్యాక్టరీకి ఒప్పందం చేసుకున్నామని మాయమాటలు చెపుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని కోసం అద్దెకు తీసుకున్న భవంతులకు ఎంత అద్దె చెల్లిస్తున్నదీ తెలియజేయాలని ఆమె డిమాండ్ చేశారు.

చంద్రబాబుపై సీబీఐ కేసులు లేవా?
చంద్రబాబుపై హెరిటేజ్ తదితర అనేక రకాలైన సీబీఐ కేసులు ఉండగా.. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పదేపదే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతున్నారు గాని, ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఉదయభాను ప్రశ్నించారు. ఈడీ ఆస్తుల ఎటాచ్‌మెంట్ గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేస్తున్నారని, దీనిపై ఎవరూ బెంబేలెత్తాల్సిన అవసరం లేదని, అవి కేవలం క్రయవిక్రయాలు చేసుకోకుండా చేయటమేనన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే తనపై ఉన్న కేసుల గురించి విచారణకు సిద్ధం కావాలని చాలెంజ్ చేశారు.

అనంతరం పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఉప్పులేటి కల్పనను ఘనంగా సత్కరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), జిల్లా అధికార ప్రతినిధి మదార్‌సాహెబ్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు జగదీష్, ప్రభాకర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బూడిద నరసింహారావు, పట్టణ అధ్యక్షులు పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు నంబూరి రవి, కౌన్సిలర్లు ఫిరోజ్‌ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు