మూడో బెటాలియన్‌ రేంజ్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌

10 Mar, 2017 22:46 IST|Sakshi
ఐజీ ఆర్‌పీ మీనా నుంచి డీఐజీ బాధ్యతలు స్వీకరిస్తున్న జి.విజయ్‌కుమార్

– ముగ్గురు సీఎంల దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహణ
– బెటాలియన్స్‌ ఐజీ నుంచి బాధ్యతలు స్వీకరణ


కర్నూలు: ఏపీఎస్‌పీ మూడో బెటాలియన్‌ రేంజ్‌ డీఐజీగా (కర్నూలు, కడప, అనంతపురం) గోగినేని విజయ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో డీఐజీగా ఉన్న ప్రసాదబాబు పదవీవిరమణ పొందారు. ఆ స్థానంలో ఇప్పటి వరకు కర్నూలు రెండో పటాలం కమాండెంట్‌గా విధులు నిర్వహించిన విజయ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఈనెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లో బెటాలియన్స్‌ ఐజీ ఆర్‌పీ మీనా నుంచి విజయ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.

2013 అక్టోబరు 29 నుంచి మూడు సంవత్సరాల ఐదు నెలల పాటు ఈయన రెండవ పటాలం కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం, గూడవల్లికి చెందిన వెంకటసుబ్బయ్య, చిన్నామణి దంపతులకు ఐదుగురు సంతానం కాగా, చిన్న కుమారుడైన విజయ్‌కుమార్‌.. బీ.కాం వరకు చదువుకున్నారు. 1982లో ఆర్‌ఎస్‌ఐ హోదాలో ఏపీఎస్‌పీ విభాగంలో విధుల్లో చేరి హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. తర్వాత వరంగల్‌ 4వ బెటాలియన్‌లో పని చేశారు. 1985 నుంచి 1998 వరకు సుమారు 13 సంవత్సరాల పాటు అప్పటి ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు.

1988లో ఆర్‌ఐగా పదోన్నతి పొందినప్పటికీ, సీఎం సెక్యూరిటీలోనే విధులు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు నల్గొండ బెటాలియన్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహించారు. 2001 నుంచి 2012 వరకు స్పెషల్‌ ఇంటలిజెన్సీ బ్రాంచి (నక్సల్స్‌ వింగ్‌)లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. 2012లో కాకినాడ, సత్తిపల్లి బెటాలియన్స్‌లో పని చేశారు. 2013 అక్టోబరు 29 నుంచి ఇప్పటి వరకు కర్నూలు రెండో పటాలం కమాండెంట్‌గా విధులు నిర్వహించారు.

వీరిది వ్యవసాయ కుటుంబం. ఈయన ఇద్దరు కూతుళ్లు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. ఇండియన్‌ పోలీస్‌ మెడల్, ఉత్తమ సేవా పతకంతో పాటు సుమారు 50 నగదు రివార్డులను ఈయన విధి నిర్వహణలో అందుకున్నారు. నెల రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన ఈయన శుక్రవారం హైదరాబాద్‌ చేరుకొని బెటాలియన్స్‌ ఐజీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండో పటాలంకు చెందిన పలువురు అధికారులు ఈ సందర్బంగా విజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు