సిటీ పోలీసులకు సరైనోడు..

25 May, 2016 12:05 IST|Sakshi
సిటీ పోలీసులకు సరైనోడు..

వస్తూనే వణుకు పుట్టిస్తున్న కొత్త సీపీ
‘సాక్షి’ కథనాలపై యోగానంద్ తొలి స్పందన
కమిషనరేట్‌లో సీసీ కిరణ్‌పై వేటు
ఏసీపీ ప్రసాదరావు, గాజువాక సీఐ
మళ్ల అప్పారావుకు మెమోలు

 
విశాఖపట్నం: నగర పోలీస్ కమిషనర్‌గా సరైనోడు వచ్చాడనేది డిపార్ట్‌మెంట్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ తాము ఆడింది ఆట, పాడింది పాటగా నడిచినా ఇక మీదట తమ ఆటలు సాగవని కొత్త సీపీ యోగానంద్ వచ్చిన రోజే వారికి అర్థమైంది. దానికి కొనసాగింపుగా రెండో రోజే సీపీ తీసుకున్న నిర్ణయాలు అవినీతి ఖాకీల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

సీపీ కార్యాలయంలో నలుగురు సీపీలు మారినా దాదాపు ఎనిమిదేళ్లుగా ఓ ఉద్యోగి మాత్రం అక్కడే ఉన్నాడు. సీపీగా ఎవరు వచ్చినా వారికి అతనే అనుచరుడు. అతనే కిరణ్. నగర పరిధిలోని పోలీస్ స్టేషన్లకు కోవర్టుగా పనిచేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. స్టేషన్‌లో పరిష్కారం కాని సమస్యలను సీపీ దృష్టికి తీసుకువచ్చేవారిని, స్టేషన్ సిబ్బందిపై ఫిర్యాదు చేసేవారిని గుర్తించి వారి ఫిర్యాదులను సీపీకి ఇస్తానని చెప్పి తీసుకుని సంబంధిత అధికారులకు సమాచారం చేరవేస్తున్నాడని అనేక ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ఐపీఎల్ కాంప్లిమెంటరీ టిక్కెట్లు పక్కదారి పట్టించిన వైనం బయటపడింది. ఈ నేపథ్యంలో అతనిపై వస్తున్న ఆరోపణలపై ఏప్రిల్ 14న ‘ఖాకీలకు కోవర్టులు’ శీర్షికతో, ‘సీపీ ఆఫీసులో ఐపీఎల్ టిక్కెట్ల దందా’ శీర్షికతో మే 9న కథనాలు ‘సాక్షి’ పత్రిక ప్రచురించింది. సీపీగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కొద్ది రోజులు సమయం తీసుకున్న యోగానంద్ హైదరాబాద్‌లో ఉంటూనే విశాఖ కమిషనరేట్‌పై అధ్యయనం చేశారు. ఇక్కడి పరిణామాలపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. వస్తూనే తన వెంట సీసీని తెచ్చుకున్నారు. కిరణ్‌ను సీసీ బాధ్యతల నుంచి తప్పించారు. తన తండ్రి మరణంతో క్యాంప్ క్లర్క్‌గా డిపార్ట్‌మెంట్‌లో చేరిన కిరణ్ సాంబశింవరావు సీపీగా ఉన్నప్పుడు సీసీగా మారారు. అప్పటి నుంచి అమిత్‌గార్గ్ వరకు అందరి సీపీలకు ఇతనే సీసీగా ఉన్నారు.

సీఐలకు మెమోలు :
ఓ కేసులో సెక్షన్‌ను 304(ఎ)ను తారుమారు చేసి అనుమానాస్పద మృతి కేసుగా మార్చేసిన గాజువాక సీఐ మళ్ల అప్పారావుకు సీపీ మోమో జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి బాధితులు సీపీని ఆశ్రయించడంతో ఒక్క రోజులోనే విచారణ జరిపించారు. సీఐను పిలిచి అడిగితే ఆ రోజు తాను సెలవులో ఉన్నానని తప్పించుకునే ప్రయత్నం చేయగా వెంటనే రికార్డులు తెప్పించి అతను చెప్పింది అబద్ధమని తెలియడంతో మోమో జారీ చేసినట్లు తెలిసింది.

ఇక 2010లో రెండో పట్టణ సీఐగా పని చేసేటప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న ప్రసాదరావు ప్రస్తుతం ఏసీపీగా ఉన్నారు. భారీగా సెటిల్‌మెంట్లకు పాల్పడి లక్షలాది రూపాయలు వెనకేసుకున్నారని, ఓ బిల్డర్ కేసులో ఉద్దేశపూర్వకంగా కేసును తారుమారు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత  ఏసీపీగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలను బట్టి సీపీ మోమో జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అడ్మిన్ ఏడీసీపీ వేంకటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. కొందరు ఎస్‌హెచ్‌ఓలకు కూడా సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

మరిన్ని వార్తలు