వృక్షో రక్షతి.. వృద్ధో రక్షితః

11 Sep, 2016 19:25 IST|Sakshi
వృక్షో రక్షతి.. వృద్ధో రక్షితః
పాలకొల్లు టౌన్‌ : ‘వృక్షో రక్షతి వృద్ధో రక్షితః..’ వృక్షాలను రక్షిస్తే, అవి దిక్కూమొక్కూ లేక అలమటిస్తోన్న వృద్ధులకు ఆశ్రయాన్ని కల్పించి రక్షణగా నిలుస్తాయి. ఈ వాక్యం మీరెక్కడ చదివి ఉండకపోతే.. తప్పనిసరిగా ఈ కథనం చదవండి. చెట్టంత ఎదిగిన కొడుకులు ఆదరించకపోవడంతో ఇద్దరు వృద్ధ మహిళలు చెట్టునీడకు చేరిన దీనగాథ ఇది. నీడైతే దొరికింది గాని కడుపునిండా బువ్వ దొరికే దారిలేక ఆ పండుటాకులు అలమటిస్తున్నాయి. 
పాలకొల్లు పట్టణం వీర హనుమాన్‌ థియేటర్‌ వద్ద ఉన్న ఒక చెట్టు కింద ఏడాదికాలంగా ఇద్దరు వృద్ధ మహిళలు కాలం వెళ్లదీస్తున్నారు. గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన కోమర్తి మహాలక్ష్మి (70)కి ఇద్దరు కుమారులు. తల్లిని దిక్కులేనిదానిలా వదిలేసి వారు వేరే ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసపోయారు. ఈ క్రమంలో మహాలక్ష్మి కొన్నాళ్లు రెక్కల  కష్టం చేసుకుని జీవనం సాగించింది. వృద్ధాప్యం మీద పడడంతో గుప్పెడు మెతుకుల కోసం ఏమీ చేయలేని పరిస్థితుల్లో దూరపు బంధువులు పాలకొల్లు శ్రీరామపేటలో ఉన్నారని ఇక్కడకు వచ్చింది. అయితే ఆమె ప్రమాదవశాత్తు పడిపోవడంతో కుడికాలు తుంటి ఎముక విరిగిపోవడంతో నడవలేని స్థితికి చేరింది. దీంతో వీరహానుమాన్‌ థియేటర్‌ వద్ద ఉన్న చెట్టుకింద స్థానికులు మడతమంచం ఏర్పాటు చేయగా ఆశ్రయం పొందింది. చుట్టుపక్కల మహిళలు పెట్టే పట్టెడన్నంతో ప్రాణం నిలుపుకుంటోంది. ఎండకు చెట్టు నీడ, వర్షం వస్తే ప్లాస్టిక్‌ బరకం కప్పుకుని కారుచీకట్లో బిక్కుబిక్కుమంటూ ఆమె సాగిస్తోన్న జీవనం చూపరులను కలచివేస్తోంది. ఈమెకు అధికారులు వృద్ధాప్య పింఛన్‌ కూడా మంజూరు చేయకపోవడం బాధాకరం. అధికారులు స్పందించి ఆమెకు వృద్ధాప్య పింఛన్‌ అందించడంతో పాటు ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్చాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. 
పట్టణంలోని 4వ వార్డు శ్రీరామపేటకు చెందిన ఖండవల్లి రాజమ్మ(75) అనే వికలాంగురాలు కూడా ఇదే చెట్టుకింద మడత మంచంపై కాలం వెళ్లదీస్తోంది. కొడుకు, కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఈమెకు ఈ దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇచ్చే పింఛన్, స్థానికుల దాతృత్వంతో చెట్టుకింద గుప్పెడు మెతుకులు వండుకుని జీవనం సాగిస్తోంది.  
 
 

 

మరిన్ని వార్తలు