మాయాజాలం

18 Feb, 2017 00:05 IST|Sakshi
మాయాజాలం

- రాయల్టీ ఒక ఖనిజానికి రవాణా మరొకటి..
-  షిటైట్‌ స్థానంలో వైట్‌సేల్‌ తరలింపు
- ఏడాదిగా సాగుతున్న దందా
- ప్రభుత్వాదాయానికి భారీగా గండి


తాడిపత్రి : వ్యాపారులు రాయల్టీ మాయాజాలానికి పాల్పడుతున్నారు. ఒక ఖనిజానికి రాయల్టీ చెల్లిస్తూ మరొక దాన్ని తరలిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా గండి పడుతోంది. ఏడాదిగా ఈ దందా సాగుతున్నా..అడ్డుకట్ట వేయడంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, గనుల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. తాడిపత్రి ప్రాంతంలో పలు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి గ్రానైట్‌, నల్లబండలు, డోలమైట్‌, షిటైట్‌, వైట్‌సేల్‌ తదితర ఖనిజాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా షిటైట్‌ ఖనిజానికి దేశవ్యాప్తంగానూ, విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. పేపర్, సబ్బులు, పేస్టులు, మందుల తయారీలో ఈ ఖనిజాన్ని అధికంగా ఉపయోగిస్తుంటారు.

తాడిపత్రి ప్రాంతంలో లభ్యమవుతున్న షిటైట్‌.. చైనాకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రభుత్వానికి టన్ను షిటైట్‌పై రూ.500 రాయల్టీతో పాటు రూ.150 చొప్పున డిస్ట్రిక్ట్‌ మైనింగ్‌ ఫండ్‌ (డీఎంఎఫ్‌) చెల్లించాలి. ఇదే తరహాలో ఉండే వైట్‌షేల్‌ ఖనిజానికి టన్నుపై రాయల్టీ రూ.60 మాత్రమే. దీంతో వ్యాపారులు వైట్‌షేల్‌కు ఉపయోగించే రాయల్టీలతో షిటైట్‌ను రవాణా చేస్తున్నారు. ఒకప్పుడు పూర్తిగా ‘జీరో’ బిజినెస్‌ జరిగేది. అయితే.. వాటికి బిల్లులు తప్పకుండా ఉండాలని, ఆన్‌లైన్‌లో రసీదులు కావాలని సరుకులను దిగుమతి చేసుకునే పెద్ద పరిశ్రమలు నిబంధన పెడుతుండడంతో వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు.

ఆలస్యంగా గుర్తించిన అధికారులు
ఏడాదిగా రాయల్టీల దందా సాగుతున్నా..అధికారులు మాత్రం ఆలస్యంగా గుర్తించారు. వైట్‌షేల్‌ ఖనిజ  లభ్యత తక్కువగా ఉన్నా..రాయల్టీలు మాత్రం పెద్దఎత్తున తీసుకుంటుండటంతో వారికి అనుమానం వచ్చింది.  రెండు నెలల క్రితం యాడికి మండలం రాయలచెరువు, పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు, కొండుపల్లి గ్రామాల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గనుల్లో ఖనిజ లభ్యత, రవాణా, పౌడర్‌ పరిశ్రమల్లో ఉన్న ఖనిజం మధ్య భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు. ఏకంగా 22 మందికి నోటీసులు జారీ చేశారు. రికార్డులు సమర్పించాలని, రాయల్టీల వివరాలను చూపాలని ఆదేశించారు.

ఇప్పటి వరకు ఎనిమిది మంది మాత్రమే రికార్డులు చూపించారు. అలాగే జనవరి నుంచి ఇప్పటివరకు రాయల్టీ ఒకటి, ఖనిజం మరొకటి కల్గిన పది ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. ఒక్కో దానిపై రూ.25వేల జరిమానా విధించారు. ఇలా అక్రమంగా నెలకు దాదాపు రూ.కోటి విలువైన ఖనిజం తరలిపోతున్నట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. అక్రమ రాయల్టీలు వినియోగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకులు ఉండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.

అక్రమాలు వాస్తవమే–వెంటేశ్వరరెడ్డి,  గనుల శాఖ సహాయ సంచాలకులు, తాడిపత్రి
రాయల్టీల మాయాజాలం మా దృష్టికి రావడంతో తనిఖీలు చేశాం.  10 వాహనాలను సీజ్‌ చేసి పోలీసులకు అప్పగించాం. జరిమానా కూడా విధించాం. అక్రమంగా రవాణా చేస్తున్న వారికి నోటీసులు జారీచేసి.. ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం.

నెల                     ఖనిజం         జారీ చేసిన రాయల్టీలు
నవంబర్‌           డోలమైట్‌          28,675
నవంబర్‌           షిటైట్‌              1,700
నవంబర్‌          వైట్‌షేల్‌            3,300
డిసెంబర్‌          డోలమైట్‌           39,350
డిసెంబర్‌          షిటైట్‌               719
డిసెంబర్‌           వైట్‌షేల్‌            4,450
జనవరి              డోలమైట్‌           19,440
జనవరి              షిటైట్‌               1,209
జనవరి              వైట్‌ షేల్‌            2,000

మరిన్ని వార్తలు