మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం

12 Sep, 2015 12:31 IST|Sakshi
మంత్రి సభలో మహిళ ఆత్మహత్యాయత్నం

బెల్లంపల్లి: ముగ్గురు రాష్ట్ర మంత్రుల సాక్షిగా భూమి కోసం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం జరిగింది. నిండు సభలో హెయిర్‌డై తాగి బలవన్మరణానికి యత్నించిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెల్లంపల్లి పర్యటనకు వచ్చారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా నిర్మించిన కార్యాలయ నూతన భవనానికి మంత్రి హరీశ్‌రావు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతుండగా.. బెల్లంపల్లి సుభాష్‌నగర్‌బస్తీకి చెందిన ఆరే వరలక్ష్మి అనే మహిళ సూపర్‌వాస్మల్ 33 హెయిర్‌డైని తాగి పడిపోయింది. పోలీసులు అంబులెన్స్‌లో ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా బాధితురాలు వరలక్ష్మి ఆస్పత్రిలో విలేకరులతో మాట్లాడింది.

‘నా తండ్రి పురంశెట్టి బాపు తాండూర్ శివారులోని సర్వే నం.699/1లో ఉన్న ఒక ఎకరం 42 సెంట్ల పట్టా భూమిని నాకు కట్నంగా ఇచ్చారు. ఆ భూమిని తాండూర్ జెడ్పీటీసీ మంగపతి సురేశ్‌బాబు  కబ్జా చేసుకున్నాడు. 2011 నుంచి జెడ్పీటీసీ నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఆక్రమణకు గురైన భూమి విషయమై హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ఇంత వరకు జెడ్పీటీసీ సురేశ్‌బాబు భూమి మాత్రం అప్పగించలేదు.

జెడ్పీటీసీకి మద్దతుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బెల్లంపల్లి టీఆర్‌ఎస్ నాయకులు పసుల సురేశ్ ఫోన్ చేసి రోజూ భూమి విడిచిపెట్టాలని బెదిరిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు దృష్టికి నా సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే హెయిర్‌డైని తాగాను’.   
 
పరామర్శించిన కలెక్టర్..
సభ ముగిసిన అనంతరం వరలక్ష్మిని కలెక్టర్ జగన్మోహన్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఆర్డీవో ఆయేషామస్రత్‌ఖానం, తహసీల్దార్ కె.శ్యామలదేవి ప్రభుత్వాస్పత్రితో బాధితురాలిని పరామర్శించారు. కలెక్టర్ జగన్మోహన్ ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెతో మాట్లాడుతూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు