సుజనాచౌదరి సభలో మహిళల గగ్గోలు!

26 Nov, 2016 00:16 IST|Sakshi
సుజనాచౌదరి సభలో మహిళల గగ్గోలు!

రాజంపేట/పుల్లంపేట:  రాజంపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పుల్లంపేట రెడ్డిపల్లె చెరువుకట్ట సమీపంలో శుక్రవారం వనం-మనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి  కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముందువరుసలో ఉన్న మహిళలు ఒక్కసారిగా లేచి తమకు ప్రభుత్వపరంగా జరుగుతున్న నష్టాలు, అన్యాయాలపై నినాదాలతో నిరసన వ్యక్తంచేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని  , ఫించన్‌ రాలేదని, పని దినాలు కల్పించాలని, కరెంటు బిల్లులు కట్టలేకున్నామని  మంత్రికి వినిపించేలా అరిచారు.అయితే వీరి గురించి పట్టించుకోకుండా సన్మాన ఆనందంలో మునిగిపోయారు.
50రోజుల పనిదినాలు కల్పిస్తాం: కలెక్టరు
మహిళ కేకలు విని మంత్రి సుజనా వారి పరిస్థితి గురించి తెలుసుకోవాలని జిల్లా కలెక్టరు సత్యనారాయణను ఆదేశించారు. తమ అధికారి ద్వారా తెలుసుకున్న కలెక్టరు 50రోజులు పనిదినాలు కల్పిస్తామని  చెప్పారు. అయినా మహిళలు సమాధానపడలేదు.
కంటతడిపెట్టిన నిరుపేదమహిళ..
తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, పింఛను సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితలేకుండాపోయిందని చిన్నఓరంపాడుకు చెందిన నిరుపేద మహిళ గంగమ్మ కంటతడిపెట్టింది. ఈమెను పలకరించే నాథుడు కనిపించలేదు. నియోజకవర్గంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా సభకు తీసుకొచ్చారు. మంత్రికి   స్వాగతం పలికేందుకు గంటలతరబడి ఎండలో నిరీక్షించారు. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళలు మంత్రి సుజనా ప్రసంగిస్తున్న తరుణంలో సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది.  
ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు కృషి: సుజనా
రాజంపేట: ప్రత్యేకప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి వై.సుజనాచౌదరి అభిప్రాపయడ్డారు. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువు కట్ట సమీపంలో వనం–మనం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప పవర్‌ఫుల్‌ జిల్లా అని కొనియాడారు.ఇక్కడ సహజవనరులు, ఖనిజాలు ఉన్నాయన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు సీఎం కృషిచేస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు కష్టాలు పడుతున్నారు.  కడపలో యోగివేమన విశ్వవిద్యాలయంలో   సైన్స్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు.  జిల్లాలో ఉక్కుపరిశ్రమ స్థాపనకు కృషిచేస్తామన్నారు.  సీఎం రమేష్,  పౌరసరఫరాల అభివృద్ధిసంస్ధ చైర్మన్‌ లింగారెడ్డి, జిల్లా కలెక్టరు సత్యనారాయణ, శాసనమండలి నేత సతీష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనువాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పసుపులేటి బ్రహ్మయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు మాట్లాడారు.  

 

మరిన్ని వార్తలు