మోదీ, కేసీఆర్ అంటే బాబుకు భయం

19 May, 2016 02:27 IST|Sakshi
మోదీ, కేసీఆర్ అంటే బాబుకు భయం

- జలదీక్ష ముగింపు సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- ‘ఓటుకు కోట్లు’ కేసు వల్లే కేసీఆర్ అంటే బాబుకు వణుకు
- అవినీతిపై సీబీఐ విచారణ జరిపిస్తాడని మోదీ అంటే భయం
- ఏమీ అడగలేని వాడివి ఢిల్లీ ఎందుకు పోయావు బాబూ?
- కేసీఆర్.. ఎగువ రాష్ట్రాలపై జరిపిన ఉమ్మడి పోరును గుర్తుచేసుకోండి
- మనం గొడవలు పడొద్దు... వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం

 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఎక్కడ జైల్లో వేయిస్తారోనని భయపడే కేసీఆర్ కడుతున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తన మంత్రులను కేంద్ర కేబినెట్‌లో నుంచి ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్రమోదీకి అల్టిమేటం ఇచ్చే దమ్ము, ధైర్యం బాబుకు లేవని ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి మనకు సీఎం అని చెప్పుకునేందుకు అందరం సిగ్గు పడుతున్న పరిస్థితి ఉందని జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ  ప్రాజెక్టులపై ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో వైఎస్ జగన్ చేపట్టిన జల దీక్ష బుధవారం (18వ తేదీ) సాయంత్రం ముగిసింది. రైతులు కురువ వెంకోబారావు, సుబ్బారెడ్డి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని ఆయన దీక్ష విరమించారు. ‘తెలంగాణ ప్రాజెక్టులపై రెండు నెలల సమయం ఇస్తున్నాం.. అప్పటికీ మార్పురాకపోతే గోదావరిపై దీక్షల ద్వారా మరింత ఉధృతంగా పోరాటం చేస్తాం’’ అని ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రస్తుతం కృష్ణా పరీవాహక ప్రాంతంలో పోరాటం చేస్తున్నామని.. ఈ దీక్షలతో నెల, రెండు నెలల్లోగా వీళ్లల్లో  మార్పు వస్తుందేమోనని ఎదురుచూస్తామన్నారు. లేనిపక్షంలో మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. కర్నూలు ‘జలదీక్ష’ ముగింపు సభలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే....

‘‘కేసీఆర్‌ను ఒక్క మాట అడగదలచుకున్నా. మొన్నటిదాకా అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాం. ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు మహారాష్ర్ట, కర్ణాటక వాళ్లు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే  కలిసికట్టుగా వ్యతిరేకించాం. ఇప్పుడు మీరు కూడా మధ్యలో వచ్చి శ్రీశైలానికి నీరు రాకముందే మహబూబ్‌నగర్ నుంచే 800 అడుగులు లోపే పంపులు పెట్టి నీటిని పైనే తోడేస్తామనడం న్యాయమా? గోదావరి నది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహిస్తుందని చెప్పి.. గోదావరి నీరు ఆంధ్రప్రదేశ్‌లోకి రాకమునుపే ఎడాపెడా ప్రాజెక్టులు కట్టి దాదాపుగా రోజూ 70 వేల క్యూసెక్కుల నీరు తోడేసుకుంటే.. కింద ఉన్న రైతులకు నీళ్లు ఎలా వస్తాయనే ఆలోచన కూడా రావడం లేదా? మా రాష్ట్రం పైన  ఉండి మీ రాష్ర్టం కింద ఉండి ఉంటే...మేం కనుక నీళ్లు ఆపి ఉంటే మీకు నచ్చేదా?  ఇవాళ కావలసింది మనం మనం తన్నుకోవడం, గొడవలు పడటం కాదు. అందరం కలిసికట్టుగా ఒక్కటై ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావడం.. అన్యాయం జరక్కుండా చూడడం. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే అందరం కలసికట్టుగా దామాషా పద్ధతిలో నీటిని పంచుకోవాలి. ప్రతి చుక్కలో ఎవరి వాటా వారికి రావాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి నీటిని కిందకు వదిలే విధానం రావాలి.  

జైల్లో పెట్టిస్తారనే చంద్రబాబు భయం..
ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నోటి నుంచి ఎలాంటి మాటా రావడం లేదు.  కొన్నాళ్ల క్రితం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రూ. 5 నుంచి రూ. 25 కోట్లు లంచం ఇస్తూ చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడు.  కేసీఆర్‌ను గట్టిగా నిలదీస్తే ఆయన ఓటుకు కోట్లు కేసు బైటకు తీస్తాడని చంద్రబాబుకు భయం. ఆ టేపులు బైటకు తీసి జైల్లో పెట్టిస్తాడని చంద్రబాబుకు భయం. పోనీ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీనన్నా అడుగుతారా అంటే.. ఈ 24 నెలల్లో  చేసిన అవినీతి మీద సీబీఐతో విచారణ వేయించి జైల్లో పెట్టిస్తారేమోనని చంద్రబాబు భయం.

మీరు గనుక ఇవన్నీ చేయకపోతే మా మంత్రులను మీ కేబినెట్ నుంచి ఉపసంహరించుకుంటామని అల్టిమేటం ఇచ్చే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవు. చంద్రబాబూ నువ్వు కేసీఆర్‌ను నిలదీయలేవు. నరేంద్ర మోదీని నిలదీయలేవు. మరి ఢిల్లీకి ఎందుకెళ్లావయ్యా అని చంద్రబాబును అడుగుతున్నా. ఏం చేయడానికి వెళ్లావయ్యా అని అడుగుతున్నా. ఢిల్లీకి వెళ్లి ప్రత్యేక హోదా గురించి మోదీతో ఏమీ మాట్లాడారో తెలియదు. ప్రత్యేక హోదా వస్తే ఏం మంచిది? ఏమీ జరగదు అని ఈయనే అంటాడు. ఢిల్లీకి వెళ్లి ఏం సాధించావని నిలదీస్తారేమోనని ఈయనంతకు ఈయనే ప్రత్యేక హోదా వస్తే ఏం మేలు అని ఎదురు ప్రశ్నిస్తాడు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడు కాబట్టి... కేసీఆర్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని ఢిల్లీలోమోదీకి ఫిర్యాదు చేస్తారేమోనని ఆశగా ఎదురుచూశాం. దీక్షలు చేస్తున్నాం. ధర్నాలు చేస్తున్నాం.  ఫిర్యాదు సంగతి దేవుడెరుగు.. బాబు బైటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై మీ వైఖరి ఏమిటని చంద్రబాబును ఒక విలేకరి అడిగితే... ‘అన్ని అనుమతులు తీసుకుని కట్టాలి...సీడబ్ల్యుసీ అనుమతి తీసుకోవాలి...కేంద్రం పరిష్కరించాలి!’ ఇవీ ముఖ్యమంత్రి మాటలు. ఇవన్నీ మాకు తెలియవా అని చంద్రబాబును అడుగుతున్నా. ఇవేవీ లేకుండా వాళ్లు కడుతుంటే నువ్వు ఏమి చేస్తున్నావు? ఇటువంటి వ్యక్తి మనకు సీఎం అని చెప్పుకునేందుకు నిజంగా అందరం కూడా సిగ్గు పడాల్సిన పరిస్థితి.

మరిన్ని వార్తలు