ఎమర్జెన్సీని తలపిస్తోంది...

19 Jun, 2016 11:16 IST|Sakshi
వినతి పత్రం అందజేత సందర్భంగా కలెక్టర్ అరుణ్ కుమార్ తో మాట్లాడుతున్న వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు
  • కాపులపై అణచివేతకు వెంటనే స్వస్తి చెప్పాలి
  •  ఇళ్ళల్లోకి వెళ్ళి మరీ స్టేషన్లకు తరలించి కేసులు
  •  పద్ధతి మార్చుకోకపోతేరోడ్డెక్కక తప్పదు
  •  వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
  •  కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన నేతలు
  •  
    కాకినాడ : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష నేపథ్యంలో పోలీసులు కాపు సామాజిక వర్గంపై వ్యవహరిస్తున్న తీరు ఎమర్జెన్సీని తలపిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. జిల్లాలో కాపు సామాజిక వర్గంపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్న తీరును నియంత్రించాలని కోరుతూ జిల్లా కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు శనివారం రాత్రి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
     
     అనంతరం కన్నబాబు కలెక్టరేట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ తుని ఘటనను, ముద్రగడ దీక్షను సాకుగా తీసుకుని  కాపు సామాజిక వర్గంపై అణచివేత ధోరణిలో దమన కాండ సాగిస్తున్న పోలీసులు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యమాలకు దూరంగా ఉన్న నాయకులు, కాపు యువత ఇళ్ళకు కూడా వెళ్ళి సోదాలు చేస్తూ బలవంతంగా స్టేషన్లకు ఈడ్చుకువెళ్ళి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజార్టీ సామాజిక వర్గంగా ఉన్నకాపుల పట్ల ప్రభుత్వం ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఒకటి, రెండు శాతం ఉండే సామాజిక వర్గాల పట్ల ఈ ప్రభుత్వ అణచివేత ధోరణి మరెంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చునన్నారు.
     
     ఇది 60 ఏళ్ళ పోరాటం
     రిజర్వేషన్ల కోసం కాపులు చేస్తున్న ఉద్యమం ఇవాళ్టిది కాదని, 60 ఏళ్ళ పోరాటమని కన్నబాబు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి లేకపోవడమే ప్రస్తుతం ఈ ఉద్యమానికి కారణమైందన్నారు. తునిఘటన పేరుతో ఇతర వర్గాలపై కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆస్పత్రిలో ఉన్న వ్యక్తిని కూడా బలవంతంగా తీసుకొచ్చి జైలుకు పంపారని కన్నబాబు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట కాపు సద్భావన సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి బసవాల ప్రభాకరరావు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌కుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అత్తిలి సీతారామస్వామి,  నాయకులు రంకిరెడ్డి దుర్గారావు,గట్టి రవి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు